Begin typing your search above and press return to search.

పెట్రోల్- డీజిల్ డీలర్లపై సెస్ విధించిన ఏపీ సర్కార్

By:  Tupaki Desk   |   18 Sept 2020 10:00 PM IST
పెట్రోల్- డీజిల్ డీలర్లపై సెస్ విధించిన ఏపీ సర్కార్
X
ఆంధ్రప్రదేశ్ ఖజానా నింపుకునేందుకు ఏపీ ప్రభుత్వం వివిధ రూపాల్లో ఆదాయం పెంచుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీగా మద్యం ధరలు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుకుంటూ పోయిన జగన్ సర్కార్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలనూ పెంచిన జగన్ సర్కార్ త్వరలోనే రవాణాశాఖలో పన్నులు పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో 3 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేయాలన్న యోచనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై సెస్ విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది జగన్ సర్కార్. ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్ కు అదనంగా పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ పై రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. డీలర్ వద్ద నుంచి ఈ సెస్ మొత్తాన్ని వసూలు చేయాలని ఆర్డినెన్స్ లో పేర్కొంది. రహదారి అభివృద్ధి నిధి కోసం ఈ సెస్ వసూలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. సెస్ ద్వారా ఖజానాకు 600 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అదనపు ఆదాయాన్ని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రజలపై రకరకాల పన్నుల భారం పడిన నేపథ్యంలో తాజాగా పెట్రో, డీజిల్ డీలర్లపైనా పన్ను భారం పడడం చర్చనీయాంశమైంది.