Begin typing your search above and press return to search.

ఏపీలో బాబును ప్రభుత్వ ఉద్య్గోగులు తిట్టుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   2 July 2020 9:22 PM IST
ఏపీలో బాబును ప్రభుత్వ ఉద్య్గోగులు తిట్టుకుంటున్నారా?
X
చూసేందుకు చిన్న విషయాలుగా అనిపించినప్పటికీ..వాటి ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది.తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ విపక్ష నేత చంద్రబాబు. ప్రతినెల మొదటితేదీన బ్యాంకు ఖాతాల్లో పడే ప్రభుత్వ ఉద్యగుల జీతాలుఈసారి పడలేదు. మరో మూడు రోజుల వరకూ ఆలస్యమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ ఆలస్యానికి కారణం చంద్రబాబేనని తప్పు పడుతున్నారు. ఎందుకిలా? విపక్ష నేత.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రాకుండా ఆపే పరిస్థితి ఉంటుందా? అంటే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే.

మొన్న రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే. ఈ సందర్భంగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టటంతో పాటు.. ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. అనంతరం మండలికి వెళ్లింది. అక్కడ ద్రవ్య వినిమయబిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ (మండలిలో టీడీపీకి మెజార్టీ ఉన్న విషయం తెలిసిందే) సభ్యులు అడ్డుకున్నారు. మండలిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మండలి డిఫ్యూటీ ఛైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేయటంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో.. ఖాజానా నుంచి డబ్బులు తీసుకోలేని పరిస్థితి.

రూల్ పొజిషన్ చూస్తే.. మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందని పక్షంలో.. సదరు బిల్లునుప్రవేశ పెట్టిన పద్నాలుగు రోజుల తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపే వీలుంటుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ గడువు బుధవారం అర్థరాత్రితో ముగిసింది. ఈ రోజు (గురువారం) గవర్నర్ ఆమోదానికి పంపుతారు. అక్కడ ఆమోదముద్ర పడిన తర్వాత కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వారి బ్యాంకు ఖాతాలో పడని పరిస్థితి.

బిల్లు ఆమోదానికి గవర్నర్ రెండు మూడు రోజుల సమయం తీసుకుంటే.. జీతాలు రావటం ఆలస్యమవుతుందని చెప్పక తప్పదు. దీంతో.. ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలు పడే తీరుకు భిన్నంగా పరిస్థితులు చోటు చేసుకోవటం.. అందుకు చంద్రబాబు కారణం కావటంతో వేలాది ప్రభుత్వ ఉద్యోగులు తిట్టుకోవటం ఖాయమని చెప్పక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఫర్లేదు కానీ పెన్షన్ల మీద ఆధారపడే వారికి మాత్రం కాస్త తిప్పలు తప్పవు.