Begin typing your search above and press return to search.

పండ‌గ వేళ జీతాల కోసం ఎదురుచూపులు!

By:  Tupaki Desk   |   7 Oct 2021 7:14 AM GMT
పండ‌గ వేళ జీతాల కోసం  ఎదురుచూపులు!
X
ద‌స‌రా పండ‌గ వ‌చ్చిందంటే ప్ర‌భుత్వ ప్రైవేటు రంగాలు అనే తేడా లేకుండా ఉద్యోగుల బోస‌న్ ఆనందంలో మునిగిపోతారు. ఆయా కంపెనీలు ఏడాదికోసారి ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని బోన‌స్ ప్ర‌క‌టిస్తాయి. ఇక ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కైతే బోన‌స్ రూపంలో అద‌న‌పు ఆదాయం భారీగానే వ‌చ్చి చేరుతుంది. అందుకే అంద‌రూ ఈ పండగ కోసం ఆనందంగా ఎదురు చూస్తారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అక్టోబ‌ర్ 7 తేదీ వ‌చ్చినా ఇప్ప‌టికీ అక్క‌డ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సెప్టెంబ‌ర్ జీతాలు అంద‌లేదు. మ‌రికొంత మంది విశ్రాంత ఉద్యోగ‌ల‌కు పెన్ష‌న్లు జమ కాలేదు. ఈ నేప‌థ్యంలో పండగ‌ వేళ వాళ్ల‌కు ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు.

ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి ఏమంత బాగాలేదు. సంక్షేమ ప‌థ‌కాలు ఇత‌ర వాటి కోసం ప్ర‌భుత్వం భారీగా ఖ‌ర్చు పెడుతోంది. కానీ ఆదాయం మాత్రం ఆ స్థాయిలో రావ‌డం లేదు. దీంతో అప్పులు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఆ రాష్ట్రానిది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌కాలంలో జీతాలు అందించేందుకు రాష్ట్ర ఖ‌జ‌నాలో స‌రిప‌డా డ‌బ్బు లేదు. దీంతో గ‌త కొన్ని నెల‌లుగా ఉద్యోగుల‌కు జీతాలు ఆల‌స్యంగానే అందుతున్నాయి. ఈ సారైనా పండగ వేళ స‌కాలంలో జీతాలు అందుతాయ‌ని ఎదురు చూసిన ఉద్యోగుల‌కు నిరాశే క‌లుగుతోంది. జీతాలు పెన్ష‌న్లు ఖాతాలో ప‌డ‌క‌పోవ‌డంతో వాళ్లంతా ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రోవైపు అధికారులు మాత్రం ఈ రోజు సాయంత్రం లోపు జీతాలు పెన్ష‌న్ల‌ను పూర్తిస్థాయిలో జ‌మ చేస్తామ‌ని తెలిపారు.

ఇప్ప‌టికే ప‌రిమితికి మించి అప్పులు చేస్తోంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వంపై విప‌క్షాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా గ‌త నెల‌లో అద‌నంగా రూ.10,500 కోట్లు అప్పు చేసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమ‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ అప్పుతో సెప్టెంబ‌ర్ అక్టోబ‌ర్ నెల‌లు గ‌డిపేయోచ్చ‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ ఈ నెల‌లో ఇంకా ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పెన్ష‌న్లు మాత్రం జమ చేయ‌లేదు. అప్పు దొర‌క‌క‌పోతే పాత బకాయిల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌లేని ఉద్యోగుల‌కు వేత‌నాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఈ రెండు నెల‌లు ఎలాగో గ‌డిచిపోయిన‌ప్ప‌టికీ.. మ‌ళ్లీ న‌వంబ‌ర్ డిసెంబ‌ర్ నెల‌ల కోసం రాష్ట్రం స‌ర్కారు అప్పు చేయాల్సిందేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే స‌కాలంలో జీతాలు రాక ఇబ్బందులు ప‌డుతున్న‌ ఉద్యోగులపై ఈ ప్ర‌భావం క‌చ్చితంగా ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంటున్నారు.