Begin typing your search above and press return to search.

సింగ‌పూర్ టూర్‌: ఓన్లీ ఎల్లో రైతుల‌కేనా?

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:52 PM GMT
సింగ‌పూర్ టూర్‌: ఓన్లీ ఎల్లో రైతుల‌కేనా?
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి చెప్పుకునేందుకు అనేక స్టోరీలున్నాయి. రాజ‌ధాని ప్రాంతం నిర్ణ‌యంలోనే పెద్ద రాజ‌కీయ కుట్ర ఉంద‌ని అంటారు. న‌దీ ప‌రివాహ‌క ప్రాంతం ప‌క్క‌న అయితే బాగుంటుంద‌ని పైకి చెబుతున్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డి ప్రాంతం అయితే, పెట్టుబ‌డిదారులకు అనుకూలంగా ఉంటుంద‌ని సీఎం చంద్ర‌బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌ధాని ప్రాంతాన్ని ఇక్క‌డ ఎంచుకున్నారు. ఇక‌, రైతుల నుంచి భూములు సేక‌రించ‌డం, ఇవ్వ‌నివారిపై కేసులు పెట్ట‌డం, అప్ర‌కటిత కర్ఫ్యూను అమ‌లు చేయ‌డం తెలిసిందే.

ఇక‌, ఇప్ప‌టికీ రాజ‌ధాని కోసం భూములు ఇవ్వ‌ని వారిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉండ‌డం మ‌రో విచిత్రం. అయితే, ఈ భూముల సేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా విప‌క్షం వైసీపీ ఎప్పుడు ఆందోళ‌న చేప‌ట్టినా.. అధికార ప‌క్షం భారీ స్థాయిలో ఎదురు దాడి చేయ‌డం అనుకూల ప‌త్రిక‌ల‌తో క‌థ‌నాలు రాయించ‌డం కూడా స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. దీంతో విప‌క్షం ఏం మాట్లాడినా రైతు వ్య‌తిరేక పార్టీ అనే ముద్ర‌ప‌డేలా తెలుగు దేశం పార్టీ నేత‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు ప్రారంభించారు. ప్ర‌పంచ బ్యాంకుకు కొంద‌రు రాసిన లేఖ‌ల విష‌యంలోనూ తెలుగు దేశం త‌మ్ముళ్లు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా రాజ‌ధాని రైతుల‌ను సింగ‌పూర్‌కు తీసుకువెళ్తున్న‌ట్టు సీఆర్ డీఏ అధికారులు ప్ర‌క‌టించారు. అది కూడా సుమారు 100 మందికి మాత్ర‌మే అవ‌కాశం అన్నారు. అంతేకాకుండా సింగ‌పూర్ వెళ్లేందుకు అయ్యే ఖ‌ర్చు, వీసా చార్జీలు అన్నీ రైతులే భ‌రించాల‌ని బాంబు పేల్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు చ‌ర్చ అంతా ఆ వంద మందిపైనే ప‌డింది. వాస్త‌వానికి 33 వేల ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం సేక‌రించిన‌ట్టు చెబుతోంది. మ‌రి ఓ వంద మంది మాత్రమే రైతులు ఈ భూములు ప్ర‌భుత్వానికి ఇచ్చారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

సుమారు 6 వేల మంది రైతులు త‌మ భూముల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించారు. వీరిలో రెండు ఎక‌రాల రైతులు ఉన్నారు. ప‌ది నుంచి 100 ఎక‌రాలు ఉన్న‌వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు 100 మంది రైతుల‌కు మాత్ర‌మే సింగ‌పూర్ టూర్ అని సీఆర్‌డీఏ ప్ర‌క‌టించింది. అయితే ఎందుకు తీసుకువెళ్తున్నార‌ని మీడియా అడిగిన‌ప్పుడు అక్క‌డ క‌డుతున్న నిర్మాణాల‌ను చూస్తార‌ని, అలాంటి నిర్మాణాల‌నే త‌మ‌కు కేటాయించే రిట‌ర్న‌బుల్ ఫ్లాట్ల‌లో క‌ట్టించుకుంటార‌ని అధికారులు చెబుతున్నారు. అయితే, 100 మందినే ఎంపిక చేయ‌డం వెనుక మ‌త‌ల‌బుపై మాత్రం స్పందించ‌డం లేదు.

రాజ‌ధాని విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ఏం చేస్తున్నార‌నేది బ్ర‌హ్మ ర‌హ‌స్యం. ఈ విష‌యాన్ని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వెల్ల‌డించారు. దీనిని బ‌ట్టి.. రాజ‌ధానిలో ఏం జ‌రుగుతోంద‌నేది మిస్ట‌రీయేన‌ని తెలిసిపోతోంది. తాజాగా ఇప్పుడు ఓ వంద‌మంది రైతుల‌ను బాబు.. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌కు తీసుకువెళ్తున్నారు. అయితే, ఈ వంద మందీ కేవ‌లం టీడీపీ విభాగానికి చెందిన రైతులేన‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది నిజం కాక‌పోతే.. క‌నీసం వెయ్యి మందినైనా తీసుకు వెళ్లాలి క‌దా!! అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ బాబు వ్యూహం వెనుక అనేక సందేహాలు.. రాజ‌ధాని మిస్ట‌రీ లాగా!!