Begin typing your search above and press return to search.

రాజ‌ధాని రైతుల‌కు ఈ బంపర్ ఆఫ‌ర్ ఎందుకో?

By:  Tupaki Desk   |   27 Sep 2017 8:38 AM GMT
రాజ‌ధాని రైతుల‌కు ఈ బంపర్ ఆఫ‌ర్ ఎందుకో?
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోస‌మంటూ గుంటూరు జిల్లా ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి ప‌రిధి రైతుల నుంచి 34 వేల‌కు పైగా ఎక‌రాల‌ను లాగేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... స‌ద‌రు భూముల్లో ఇప్ప‌టిదాకా పెద్ద‌గా చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్ప‌టికే ప‌లుమార్లు శంకుస్థాప‌న‌ల‌తో హ‌డావిడి చేసిన చంద్ర‌బాబు... వెల‌గ‌పూడిలో మాత్రం తాత్కాలిక సెక్ర‌టేరియ‌ట్‌ - అసెంబ్లీ భ‌వ‌నాల‌ను మాత్ర‌మే నిర్మించారు. ఆ భ‌వ‌నాల నాణ్య‌త కూడా నాసిర‌కంగానే ఉంద‌న్న వాద‌న నిజ‌మేన‌ని ఎప్పుడో తేలిపోయింది. చిన్న‌పాటి వ‌ర్షానికే ఆ భ‌వ‌నాల లోగిళ్ల‌న్నీ నీటి ధార‌ల‌తో త‌డిసిముద్ద‌యిపోయాయి. రైతుల నుంచి లాగేసిన 34 వేల ఎక‌రాల భూమిలో ఈ రెండు భ‌వ‌న నిర్మాణాలు మిన‌హా ఏ ఒక్క చోట కూడా చిన్న నిర్మాణం కూడా క‌నిపించ‌దు. అయితే ఇప్పుడు కాదు అప్పుడంటూ హంగామా చేసిన చంద్రబాబు స‌ర్కారు... తాను లాగేసుకున్న భూముల్లో సాగు కుద‌ర‌దంటే కుద‌ర‌ద‌ని రైతుల ముఖం మీదే చెప్పేసింది.

బంగారం పండే భూముల్లో... రాజ‌ధాని నిర్మాణాలు ప్రారంభ‌మ‌య్యే దాకానైనా సాగు చేసుకుంటామంటూ రైతులు నెత్తీనోరు బాదుకున్నా కూడా చంద్ర‌బాబు స‌ర్కారు స‌సేమిరా అన్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. మూడు కార్లు పండే భూముల‌ను ఊరికే వ‌దిలేస్తే... త‌మ జీవ‌నాధారం ఏం కావాల‌న్న ప్ర‌శ్న‌కు స్పందించిన ప్ర‌భుత్వం ఎంతో కొంత కౌలు ప‌డేస్తామంటూ కొద్దిమొత్తంలో నిధులు విడుద‌ల చేస్తూ కూర్చుంది. ఇంకోవైపు... రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌కు ఇళ్లు - ఇత‌ర వాణిజ్య కార్య‌క‌లాపాల‌కు ఉద్దేశించి ప్లాట్లు ఇస్తామంటూ డాంబికాలు ప‌లికేసింది. ఈ ప్లాట్ల ఖ‌రారుపై సుదీర్ఘంగా మంత‌నాలు సాగించిన ప్ర‌భుత్వం... ప్లాట్లు ఇదిగో - అదిగో అంటూ చుక్క‌లు చూపిస్తోంది గానీ... స‌ద‌రు ప్లాట్ల‌ను రైతుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేసేందుకు మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు. అంతేకాకుండా స‌ద‌రు ప్లాట్ల రిజిస్ట్రేష‌న్‌కు స‌ర్వే కార‌ణాల‌ను చూపుతూ... అదేదో త‌మ ప‌రిధిలో లేని విష‌య‌మంటూ కుంటి సాకులు చెబుతోంది.

అయినా స‌ద‌రు ప్లాట్ల‌ను రైతుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేసే శాఖ త‌న చేతి కిందే ఉన్న విష‌యాన్ని రైతులు గుర్తించ‌రులే అన్న రీతిలో చంద్ర‌బాబు స‌ర్కారు మాయాజాల‌మే చేస్తోంది. అయితే స‌ర్కారు చూపిస్తున్న ఈ స్టంట్ అంతా న‌కిలీదేన‌ని రైతులు గుర్తించేందుకు ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ప్లాట్ల రిజిస్ట్రేష‌న్‌ లో ప్ర‌భుత్వం కావాల‌నే నాన్చుడు ధోర‌ణిని అవ‌లంబిస్తోంద‌ని గ్ర‌హించిన రైతులు ఇప్పుడిప్పుడే గ‌ళం స‌వరించుకుంటున్నారు. అయితే రైతుల నుంచి ఎద‌రుయ్యే నిర‌స‌న‌ల‌పై నిత్యం ఓ క‌న్నేసి ఉంచిన బాబు స‌ర్కారు... రైతుల భావ‌న‌ను అప్పుడే ప‌సిగ‌ట్టేసింది. ఏం చేస్తే... రైతుల నోళ్లు మూత‌ప‌డ‌తాయ‌న్న కోణంలో ఆలోచించిన ప్ర‌భుత్వం సీఆర్డీఏ యంత్రాంగాన్ని రంగంలోకి దించేసింది. రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల్లోని త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారితో చ‌ర్చ‌లు జ‌రిపిన సీఆర్డీఏ అధికారులు... జ‌ల్సా తాయిలాల‌ను ఎర‌గా వేస్తే స‌రిపోతుంద‌ని స‌ర్కారుకు నివేదించింద‌ట‌.

అందుకు చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇప్పుడు స‌ద‌రు జ‌ల్సా తాయిలం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ తాయిలం వివ‌రాల్లోకెళితే... రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌ను జ‌ల్సా ట్రిప్పుల‌కు తీసుకెళుతుంద‌ట‌. ఇదేదో బాగానే ఉంద‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే... రాజ‌ధానికి 34 వేల ఎక‌రాలిచ్చిన వేలాది మంది రైతుల్లో ఈ తాయిలం కేవ‌లం వంద‌మందికి మాత్ర‌మేన‌ట‌. అది కూడా ఈ జ‌ల్సా తాయిలం త‌మ‌కు ఇష్ట‌మేన‌ని ద‌ర‌ఖాస్తు చేసుకునే రైతుల్లో నుంచి కొంద‌రిని మాత్ర‌మే ఎంపిక చేస్తార‌ట‌. ఇదంతా బాగానే ఉన్నా... ఈ జ‌ల్సా ట్రిప్పు ఎక్క‌డ అంటే... ఇంకెక్క‌డ‌... బాబు గారు నిత్యం జ‌పించే సింగ‌పూర్‌లోనేన‌ట‌. ఎంపిక చేసిన వంద మంది రైతుల‌ను మూడు గ్రూపులుగా విభ‌జించి స‌ద‌రు గ్రూపుల‌ను విడ‌త‌ల‌వారీగా సింగ‌పూర్ తీసుకెళ‌తార‌ట‌.

తొలి జ‌ల్సా యాత్ర అక్టోబ‌ర్ 22 నుంచి 26 వ‌ర‌కు, రెండో యాత్ర నవంబ‌ర్ 5 నుంచి 9 వర‌కు, మూడో యాత్ర న‌వంబ‌ర్ 19 నుంచి 23 వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఇదిలా ఉంటే... ఈ జ‌ల్సా యాత్ర‌ల్లో రైతుల‌కు సింగ‌పూర్‌లోని అభివృద్దిని సీఆర్డీఏ చూపిస్తుంద‌ట‌. ఇక ఈ యాత్ర‌ల ఖ‌ర్చుల విష‌యానికి వ‌స్తే... వీసా ప్రాసెసింగ్ ఫీజుల ద‌గ్గ‌ర నుంచి విమాన టికెట్లు, సింగ‌పూర్‌లో వ‌స‌తి త‌దిత‌రాల‌న్నీ కూడా సీఆర్డీఏనే భ‌రిస్తుంద‌ట‌. మ‌రి ఈ జ‌ల్సా యాత్ర‌ల పేరిట చంద్ర‌బాబు తెర‌పైకి తీసుకొచ్చిన తాయిలం ఎంత‌మేర‌కు ప‌నికొస్తుందో చూడాలి. ఈ యాత్ర‌లు బాబు స‌ర్కారుకు ప‌నికి వ‌చ్చే మాట అటుంచితే... రైతుల్లో మ‌రింత ఆగ్ర‌హావేశాల‌ను ర‌గిలిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌న విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది. చూద్దాం ఏం జ‌రుగుతుందో.