Begin typing your search above and press return to search.

సమర్థుడైన సలహాదారుడు..జగన్ కు కొత్త అండ!

By:  Tupaki Desk   |   5 Jun 2019 5:47 AM GMT
సమర్థుడైన సలహాదారుడు..జగన్ కు కొత్త అండ!
X
తన సమర్థతను తాను గుర్తించడం కూడా పాలకుడి సమర్థతకు నిదర్శనం. నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేదని ప్రజలు రుజువు చేశారు. పార్టీని నడిపించడంలో, అనేక అవాంతరాలను ఎదుర్కొని పార్టీని విజయతీరాలకు చేర్చడంలో జగన్ మోహన్ రెడ్డి తన పటిమను నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత వరకూ ఒక ఎత్తు, ఇది వరకూ ఒక ఎత్తు.

ఆరు నెలల్లోనే తను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు జగన్. ఏపీ సీఎంగా తనకంటూ ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళుతున్నారు. అనుభవజ్ఞులను, పరిపాలన పరమైన అంశంలో మంచి అవగాహన ఉన్న వారిని జగన్ తన టీమ్ మెంబర్లుగా మార్చుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మాజీ సీఎస్ - ఐఏఎస్ అజేయ కల్లంకు తన సలహాదారు పదవిని ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.

కేబినెట్ ర్యాంక్ ఉన్న ఈ పదవితో అజేయ కల్లంకు జగన్ మోహన్ రెడ్డి కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఇది వరకూ సీఎస్ తో సహా అనేక ఉన్నత పదవులను అలంకరించారు అజేయ కల్లం. టీటీడీ ఈవోగా, విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్, ఆర్థిక, రెవెన్యూ శాఖలకు సీఎస్ గా అత్యంత కీలకమైన బాధ్యతల్లో పని చేశారు.

రాజధాని వ్యవహారంలో స్విస్ చాలెంజ్ తీరును తప్పుపడుతూ ఫైల్ లో ప్రత్యేక నోట్ రాయడం ద్వారా అధికారానికి అడుగులొత్తే అధికారి కాదు తను అని నిరూపించుకున్నారు అజేయ కల్లం.

ఇక ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యాకా కూడా అజేయ కల్లం విశ్రమించలేదు. సామాజిక బాధ్యత గల పౌరుడిగా స్పందిస్తూ వచ్చారు. ప్రభుత్వ విధానాల్లోని లోటుపాట్లను ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. సామాజిక కార్యకర్తగా మారి.. అనేక వ్యవహారాలను ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రజలను చైతన్య వంతులను చేసే ప్రయత్నం చేశారు. పుస్తకాలు రాశారు. ఒక ప్రభుత్వాధికారిగా కీలక పదవుల్లో పని చేసిన నేపథ్యం ఉండటంతో.. అజేయ కల్లంకు అక్కడి లోటు పాట్లు స్పష్టంగా అర్థమయ్యాయి. వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

అప్పుడు ఆయనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ సలహాదారుగా నియమించుకున్నారు. కేబినెట్ ర్యాంకును ఇచ్చారు. ఇప్పటి వరకూ అజేయ కల్లం తన విధులను నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకొంటూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి పాలనాపరమైన సలహాదారుగా వ్యవహరిస్తూ ఉన్నారాయన. ఇది ఆయన అనుభవానికి, ప్రతిభకు దక్కిన హోదా. ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఇచ్చిన గౌరవం. ఈ హోదాలో ఆయన మరింతగా మెరిసే అవకాశం ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.