Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో చేనేత వస్త్రాలు..జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   28 Oct 2019 5:58 AM GMT
ఆన్ లైన్ లో చేనేత వస్త్రాలు..జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం
X
ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో తినడానికే సమయం ఉండటం లేదు. దీనితో అందరూ షాపింగ్ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ - ఫ్లిప్‌ కార్ట్‌ ల్లో భారీ ఎత్తున సేల్స్ జరుగుతున్నాయి. దీనితో చేనేత వస్త్రాల వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది.దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమెజాన్ - ఫ్లిప్‌ కార్ట్‌ కంపెనీలతో ఆన్ లైన్ ద్వారా చేనేత వస్త్రాల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభించబోతుంది.

ఎన్నికలకు ముందు చేనేత రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే వైయస్సార్ చేనేత నేస్తం కింద ప్రతి సంవత్సరం రూ.24,000 ఇస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో దేశవిదేశాలకూ చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా పటిష్టమైన మార్కెటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా రకరకాలైన పట్టు చీరలు - చొక్కాలు - దోవతులు.. అన్నిరకాలైన చేనేత ఉత్పత్తులను ఇకపై ఆన్‌ లైన్ షాపింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. మీకు నచ్చిన చేనేత ఉత్పత్తులను ఆన్‌ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందుకే అమెజాన్ - ఫ్లిప్‌ కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ఆన్‌ లైన్ ద్వారా అమ్మకాలకు శ్రీకారం చుడుతోంది. నవంబర్ 1వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. తొలిదశలో భాగంగా 25 ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయిస్తున్నారు. నవంబర్ చివరి వారం నుంచి ఫ్లిప్‌ కార్ట్‌ లోను ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.

అలాగే ధరల విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆన్‌ లైన్ మార్కెట్ లో చేనేత వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా రూ.500 నుంచి రూ.20,000 వరకు ధరలు ఉంటాయి అని తెలిపింది. అలాగే మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో త్వరలోనే చేనేత కార్మికులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కబోతోంది అని చెప్పవచ్చు.