Begin typing your search above and press return to search.

చర్చలా ? సమ్మె నోటీసా ?

By:  Tupaki Desk   |   24 Jan 2022 4:58 AM GMT
చర్చలా ? సమ్మె నోటీసా ?
X
పీఆర్సీ వివాదానికి సంబంధించి సోమవారం చాలా కీలకమైన రోజనే అనుకోవాలి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళటానికి పీఆర్సీ సాధన సమితి డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని సమితి నేతలు డిసైడ్ చేశారు. ఇదే సమయంలో వివాదంపై చర్చించుకుందాం రమ్మంటు మంత్రుల కమిటి నుంచి నేతలకు ఆహ్వానం అందింది.

ఉద్యోగ నేతలతో చర్చించి పీఆర్సీ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటి వేసింది. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రమ్మని మంత్రుల కమిటీ పిలిచింది. బుగ్గన, చీఫ్ సెక్రటరీ ఢిల్లీలో ఉన్న కారణంగా మిగిలిన ముగ్గురే నేతలతో చర్చలకు కూర్చుంటారు.

మంత్రుల కమిటీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చర్చలకు వెళ్ళాలా వద్దా అనే విషయమై ఉద్యోగ నేతల మధ్య పెద్ద చర్చే జరిగింది. పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం జారీచేసిన జీవోలను రద్దు చేస్తేకానీ చర్చలకు హాజరు కాకూడదని నేతలు భావిస్తున్నారు. చర్చలకు వచ్చినపుడు అన్ని విషయాలను మాట్లాడుకుని పరిష్కరించుకుందామని కమిటీ చెబుతోంది. ఈ నేపధ్యంలోనే జనవరిలో వచ్చే డిసెంబర్ జీతాన్ని పాత జీతాన్నే ఇవ్వాలని నేతలు పదే పదే కోరుతున్నారు.

అలాగే పాత జీతాన్ని ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులను జారీచేయాలని, అలాగే కొత్త జీవోలు అమలును నెల రోజుల పాటు నిలుపుదల చేయడానికి హామీ ఇస్తుూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తే మంత్రుల కమిటితో చర్చించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని నేతలంటున్నారు. చర్చలకు వచ్చినపుడు అన్నీ విషయాలు మాట్లాడుకుందామని కమిటి చెబుతోంది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వం నుండి ట్రెజరీ అధికారులకు ఉత్తర్వులు వెళ్ళిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఏ విషయం సోమవారం తేలిపోతుంది.