Begin typing your search above and press return to search.

షర్మిల ఇంటి ముందు సీమ రైతుల ఆందోళన

By:  Tupaki Desk   |   30 Jun 2021 10:08 PM IST
షర్మిల ఇంటి ముందు సీమ రైతుల ఆందోళన
X
తెలంగాణ ఇంటి కోడలుగా మారిన రాయలసీమ బిడ్డ వైఎస్ షర్మిల.. ఇటీవల కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే జై కొట్టడం తీవ్రచర్చనీయాంశమైంది. ఒక్క చుక్క బొట్టును కూడా వదిలిపెట్టమని తనను కన్న రాయలసీమ రైతుల దృష్టిలో విలన్ గా మారారు. కడపలో పుట్టిన వైఎస్ షర్మిల నోటి నుంచి ఇలాంటి మాటలను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ తెలంగాణ రాజకీయ అవసరార్థం షర్మిల ఇటువైపే మొగ్గు చూపారు.

అయితే వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆంధ్రా సీమ రైతుల నుంచి వ్యతిరేక ఎదురైంది. రాయలసీమ ఎత్తిపోతల కు వ్యతిరేకంగా మాట్లాడిన షర్మిల ఇంటిని సీమ రైతులు ముట్టడించారు. ఆందోళన చేశారు.హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు రైతులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కృష్ణా జలాల విషయంలో షర్మిల స్పష్టమైన వైఖరి తెలుపాలంటూ ఆమె నివాసం ముందు ఆందోళనకు దిగారు.

తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న నీటి వివాదంపై వైఎస్ షర్మిల ఇటీవలే స్పందించారు. వైఎస్ షర్మిల తన మద్దతు తెలంగాణకే అని చాటిచెప్పారు. ‘తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదలుకోమని’ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అందుకు అవసరం అయితే ఎవరితో అయినా పోరాడడానికైనా తాను సిద్ధమని షర్మిల చెప్పుకొచ్చారు. దీన్ని తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం సొంత రాయలసీమ నేతలతో.. ఆఖరుకు అన్నయ్య, సీఎం జగన్ తోనూ పోరాడుతానని షర్మిల స్పష్టం చేసినట్టైంది. తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిల ఇప్పుడు తన సొంత ప్రాంతంతోనే పోరాడటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

తెలంగాణలో త్వరలో పార్టీ పెట్టి రాజకీయం చేయబోతున్న షర్మిల ఈ క్లిష్ట సమస్యపై తెలంగాణకే మద్దతు తెలపడం ఆమె సొంత ప్రాంతం సీమ రైతులు భగ్గుమన్నారు.. ఏపీ కంటే తనకు తెలంగాణ ప్రజల సమస్యలే మిన్న అన్న ఆమె ఇంటిని ముట్టడించారు.

ఏపీలో స్వయంగా షర్మిల అన్న, సీఎం జగన్ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నీటి వివాదంలో తెలంగాణపై ఆయన పోరాడుతున్నారు. ఈ నీటి వివాదంపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న షర్మిల స్పందించడం.. దానికి సీమ రైతులు భగ్గుమనడంతో షర్మిల ఇరుకునపడిపోయారు. ఈ రాజకీయంతో షర్మిల డిఫెన్స్ లో పడిపోయారని చెప్పొచ్చు.