Begin typing your search above and press return to search.

రైలు పేరు మార్చటానికి 13 నెలలా?

By:  Tupaki Desk   |   17 July 2015 4:25 AM GMT
రైలు పేరు మార్చటానికి 13 నెలలా?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తి కావటమే కాదు.. దానిపై మరో నెల కూడా అదనంగా కావొస్తోంది. ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేయటంలో చూపించిన దూకుడు.. ఉత్సాహం.. ఆయా రాష్ట్రాల సమస్యలు.. చిన్న చిన్న డిమాండ్లు తీర్చటానికి ఏడాదికిపైనే సమయం తీసుకోవటం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

పెద్ద పెద్ద అంశాల విషయంలో నిర్ణయాలు ఆలస్యం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన చిన్న అంశాల విషయంలోనూ 13 నెలల సుదీర్ఘ సమయం తీసుకోవటం చూసినప్పుడు.. కేంద్రంలో మౌన సింగ్ ప్రధానిగా ఉన్న.. మాటలు చెప్పి హడావుడి చేసే మోడీ లాంటి ప్రధాని ఉన్నా ఒకటేనన్న భావన కలగటం ఖాయం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ ప్రతి రోజు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలు పేరు మారని దుస్థితి. తాజాగా.. ఈ రైలు పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే.. ఈ ఏడాది నవంబరు 15 తర్వాత మాత్రమే తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా పిలుస్తారని చెబుతున్నారు. అంటే.. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ అన్న పేరు మీద పిలవటానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందన్న మాట.

ఒక రైలు పేరు మార్చే విషయంలో దాదాపుగా 17 నెలలు పట్టటం ఏమిటన్నది కేంద్రానికే తెలియాలి. ఒక రైలు పేరు మార్చటానికే ఇంత కాలం పడితే.. మిగిలిన పంచాయితీలు తీర్చటానికి మరెన్ని సంవత్సరాలు పడుతుందో..? అయితే.. రైలు పేరు మార్పు.. పేరు వరకే పరిమితం కాలేదని.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరుతో వ్యవహరించే నాటికే ఏపీకి ఒక ఎక్స్ ప్రెస్ రైలు ఇవ్వాల్సి ఉంటుందని.. దీనికి జరిగే కసరత్తుకారణంగానే ఇంత ఆలస్యమైందని అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. కొన్ని ముఖ్యాంశాల విషయంలోనూ.. ఇన్నెన్ని నెలల సమయం తీసుకోవటం ఏమిటన్న దానిపై మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రాకపోవటం గమనార్హం.