Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుపై పోరుకు డేట్ డిసైడ్ చేసిన ఏపీ ఉద్యోగులు

By:  Tupaki Desk   |   29 Nov 2021 12:30 PM GMT
ఏపీ సర్కారుపై పోరుకు డేట్ డిసైడ్ చేసిన ఏపీ ఉద్యోగులు
X
కొంతకాలంగా ఏపీలోని జగన్ సర్కారుకు ఆ రాష్ట్ర ఉద్యోగులకు మధ్య దూరం పెరుగుతోంది. తమకు గతంలో ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఉద్యోగులు తప్పు పడుతున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్ సీ నివేదికపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం వారు కోరుకుంటున్న రీతిలో సానుకూల స్పందన రావటం లేదు. దీంతో.. వారు ప్రభుత్వంపై పోరుకు సన్నద్ధమవుతున్నారు.

తాజాగా విజయవాడలో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు.. సుదీర్ఘంగా చర్చ జరిపి.. ఏపీ ప్రభుత్వంపై పోరు బాటకు ముహుర్తాన్ని డిసైడ్ చేశారు. ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకాలం వేర్వేరుగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఏకమై.. ఉమ్మడి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాయి. అమరావతి జేఏసీ.. ఏపీ ఎన్జీవో జేఏసీ కార్యవర్గాలు ఇప్పటికైతే ఎవరికి వారుగా సమావేశమైనప్పటికీ.. భవిష్యత్తులో మాత్రం వారు కలిసి పని చేసే అవకాశం ఉందంటున్నారు. 94 ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణను సిద్ధం చేస్తారని చెబుతున్నారు.

ఉద్యోగులకు నలభై శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాము కోరుతామని పేర్కొన్నారు. తాము చేసిన డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి చర్చలు జరిపేందుకు పిలుపు వస్తుందని తాము ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల (డిసెంబరు) 10లోపు అధికారిక ప్రకటన వెలువడుతుందనిభావిస్తున్నారు.

ఒకవేళ తాము అనుకున్నట్లుగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో తాము కార్యాచరణ చేపడతామని వారు చెబుతున్నారు. ఉద్యోగులకు 2020నుంచి ఇవ్వాల్సిన ఆరియర్స్ ను చెల్లించేలా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్యోగుల హెచ్ఆర్ఏ యథాతధంగా కొనసాగించాలని.. కేంద్ర ప్రభుత్వం తరహాలో చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలన్న ప్రతిపాదనను పెట్టనున్నట్లు చెప్పారు. సీపీఎస్ రద్దుపై తేల్చాలని.. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేయనున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే.. తాము చేస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనరావటం లేదని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన కార్యాచరణను వారు ప్రకటించారు.

డిసెంబరు 01 ఏపీ సీఎస్ కు నోటీసు
డిసెంబరు 07-10 అన్ని జిల్లాలో బ్లాక్ బ్యాడ్జీలతో ప్రదర్శన
డిసెంబరు 10 లంచ్ అవర్లో ప్రదర్శన
డిసెంబరు 13 నిరసన ర్యాలీ.. అన్నితాలుకాలు.. డివిజన్లలో సమావేశాలు
డిసెంబరు 16 డివిజన్.. ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు
డిసెంబరు 21 జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారీ ఎత్తున ధర్నాలు