Begin typing your search above and press return to search.

ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కారు ప్రకటించిన పీఆర్సీ లో హైలెట్స్ ఇవే

By:  Tupaki Desk   |   8 Jan 2022 10:10 AM IST
ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కారు ప్రకటించిన పీఆర్సీ లో హైలెట్స్ ఇవే
X
గడిచిన కొంతకాలంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్న పీఆర్సీ ప్రకటనను ముఖ్యమంత్రి జగన్ ప్రకటించటం తెలిసిందే. ఈ పీఆర్సీకి ఎందుకింత ప్రాధాన్యత అంటే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లక్షల్లో ఉండటం.. వారందరిని కలిపితే.. పెద్ద ఎత్తున ప్రజలు ప్రభావితమయ్యే ఈ ఉదంతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలా మారింది. తాజాగా సీఎం జగన్ చేసిన పీఆర్సీ ప్రకటనతో.. సీన్ మొత్తం మారిపోయింది.. ఇంతకీ పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఏం కోరుకున్నారు? ప్రభుత్వం ఏమిచ్చింది?లాంటి ప్రశ్నలతో పాటు.. అసలేంజరిగింది? అన్న విషయంలోకి వెళితే..

ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 40శాతం ఇవ్వాలని ఆశపడ్డారు. ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో అంత భారీగా పీఆర్సీ ఇవ్వలేమని సీఎమ్మే స్వయంగా చెప్పేసిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులు చేసిన సూచన ప్రకారం 14.29 శాతం ఇవ్వాలని పేర్కొంది. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పీఆర్సీ చిక్కుముడిని విప్పదీశారు. ఉద్యోగులకు 23.29శాతాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంకేం చెప్పారు? అన్నది చూస్తే..

పీఆర్సీ ప్రకటన వేళ.. ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యమైనవి..

- ఉద్యోగులకు 23.29 శాతం పీఆర్‌సీ కానుక.

- పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ఉద్యోగులకు ఊహించని వరం. 01- 01-2022 నుంచి అమల్లోకి.

- పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి.

- పెండింగ్‌ డీఏలు జనవరి నుంచి చెల్లింపు.

- 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి.

- తాజా పీఆర్సీ ప్రకటనతో ఏడాదికి ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం.

- సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమంది. ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించాం. అధికారుల కమిటీ చెప్పిన 14.29శాతం కన్నా దాదాపు 9శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నామన్న సీఎం జగన్

- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ 30లోపు ప్రొబేషనరీ, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తి . సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను ఈ ఏడాది జులై జీతం నుంచి ఇస్తాం.

- కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలు జూన్‌ 30లోపు పూర్తి.

- ఉద్యోగుల హెల్త్‌ కార్డుల సమస్యను రెండు వారాల్లో పరిష్కారం.

- సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం రిబేటుతో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ఇళ్లు కేటాయింపు.

- 10 శాతం ప్లాట్లు ఉద్యోగులకు రిజర్వ్‌ చేస్తాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుంది.

- ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌ నాటికి పూర్తిగా చెల్లిస్తాం.

- పీఆర్సీ అమలు నాటికి పెండింగ్‌ డీఏలు ఉండవు. పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇస్తాం.

- కొత్త స్కేల్స్‌ను, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 2022 జనవరి జీతాలతోనే అమలు.