Begin typing your search above and press return to search.

మా ముఖాన పసుపు పూయకండి సామీ...

By:  Tupaki Desk   |   23 Jan 2022 3:32 PM GMT
మా ముఖాన పసుపు పూయకండి సామీ...
X
ఏపీలో ఏది తీసుకున్నా అలాగే ఉంది. అది ప్రత్యేక హోదా అయినా, రాజకీయ పార్టీల విమర్శలు అయినా మరే ఆందోళన అయినా చివరికి అది కాస్తా వైసీపీ వర్సెస్ టీడీపీకి మారిపోతుంది. అంతలా రెండు పార్టీలు నిట్ట నిలువుగా నిలిచి మరీ రాజకీయ ఘర్షణ పడుతున్నాయి. దీంతో ఏ ఇష్యూ మీద ఎవరు మాట్లాడినా వారికి ఏదో ఒక పార్టీ కలర్ వెంటనే పడిపోతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటి వారికే ఇలాంటివి తప్పడంలేదు. ఇపుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటివి చూసి జడుసుకుంటున్నారు.

ఏపీలో ఇటీవలి వేతన సవరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన చేపడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏమీ తక్కువగా లేవు. పైగా వాటికి పోరాటాలు కొత్త కాదు, కానీ ఏపీలోని విపక్షాల రాజకీయ ఆరాటాలనే వారు అసలు తట్టుకోలేకపోతున్నారుట. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఆందోళన అన్నారో అలా టీడీపీ వచ్చి మద్దతు ప్రకటించేసింది. ఇలా ఆ పార్టీ కొంత రాజకీయ మైలేజీని పొందుతుందని భావించి ఉండవచ్చు.

మరో వైపు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు అతి పెద్ద సెక్షన్ కాబట్టి పోయిన చోటనే వెతుక్కుంటున్న టీడీపీ సేనలు వారి వైపు మోహరించడంలో ఆశ్చర్యంలేదు. కానీ దాంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నిర్ణయాలను ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నేతలు ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోందని ఆరోపిస్తూనే ఉన్నారు.

ఇక ఈ మధ్యనే పీఆర్‌సీపై జీవో జారీ కావడంతో ఉద్యోగులు తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించుకున్న వేళ టీడీపీ నేతలు వారికి మద్దతు పలకడం ప్రారంభించారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం గత చంద్రబాబు నాయుడు తమ ప్రయోజనాలను ఎలా పొడిగించారో జగన్ ప్రభుత్వం వాటిని విస్మరిస్తూ సందేశాలను పోస్ట్ చేస్తోంది.

ఈ పరిణామాలు వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం మరింత మొండిగా మారింది. రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ తదితరులు ఎదురుదాడికి దిగారు, ఉద్యోగులు రాజకీయ ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు. అసలు టీడీపీ ఉద్యోగులకు ఏం చేసింది అని కూడా వారు అంటున్నారు. ఇలా ఉద్యోగుల ఇష్యూతో మళ్లీ రాజకీయ తూటాలు అటూ ఇటూ పేలుతున్నాయి

మరో వైపు చూస్తే రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనల వెనుక టీడీపీ హస్తం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోందిట. దీంతో ఉద్యోగుల సంఘాలు ఇబ్బందుల్లో పడ్డాయి. టీడీపీ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన జారీ చేయాల్సి వస్తోంది.

ఈ నేపధ్యంలో తాము ఏ రాజకీయ పార్టీ నుండి మద్దతు కోరలేదు. టీడీపీ లేదా మరే ఇతర పార్టీ ప్రమేయం మాకు అక్కర్లేదు. వేతన సవరణ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఉంది అని జేఏసీ నేతలు అంటున్నారు. ఉద్యోగులకు మద్దతుగా ఏదైనా రాజకీయ పార్టీ ఏదైనా ప్రకటన చేస్తే అది కేవలం తమ రాజకీయ మైలేజీ కోసమే తప్ప ఉద్యోగులకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు

ఇక తమ పోరాటానికి ఎలాంటి రాజకీయ అంశాలు లేవని టీడీపీ నేతలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ సమస్య నుంచి పార్టీ దూరంగా ఉంటేనే మంచిది అని జేఏసీ నేతలు తేల్చి చెప్పడం విశేష పరిణామమే. అంతే కాదు మాకు మీ రాజకీయ పులుముడు వద్దు సారూ అని మొరపెట్టుకున్నట్లుగా కూడా ఉందని అంటున్నారు.

అయినా టీడీపీ తమ్ముళ్ళు ఊరుకుంటారా తమ అనుకూల చానళ్ళలో డిబేట్లు పెడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి వైసీపీ సర్కార్ ని విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామాలతో ఉద్యోగులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైమ్ మాకు పొలిటికల్ సపోర్ట్ వద్దు మహా ప్రభో అనాల్సి వస్తోందిట. ఎంతైనా ఏపీ రాజకీయమే వింత కదూ, అందుకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి.