Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీకి సీఈసీ పిలుపు! ఇదేంటి బాసూ!

By:  Tupaki Desk   |   4 April 2019 7:39 AM GMT
ఏపీ డీజీపీకి సీఈసీ పిలుపు! ఇదేంటి బాసూ!
X
ఆంధ్రప్రదేశ్ డీజేపీ ఠాకూర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపురావడం ఆసక్తిదాయకంగా మారింది. అందుకోసం ఢిల్లీ వెళ్లి ఈ రోజు సీఈసీని కలిశారాయన. ఇంతకు ఠాకూర్ కు ఎందుకు పిలుపు వచ్చిందంటే అందుకు సంబంధించి పలు ఊహాగానాలున్నాయి. ఇటీవల ఏపీలో ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ విషయంలో ఠాకూర్ తీరు చర్చనీయాంశంగా మారింది. సీఈసీ ఆదేశాలను ధిక్కరించి.. ఠాకూర్ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని ఆపాలని ప్రయత్నించినట్టుగా వార్తలు వచ్చాయి.

ముందుగా.. ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత ఆ బదిలీని ఆపుతూ మరో జీవో జారీ చేసింది. అది వివాదాస్పదంగా మారింది. దానిపై కోర్టుకు వెళ్లింది ఎన్నికల కమిషన్. ఆ వ్యవహారంలో కోర్టు సీఈసీ పక్షానే నిలిచింది. వెంకటేశ్వరరావు బదిలీ విషయంలో సీఈసీ ఉత్తర్వులకే కోర్టు వత్తాసు పలికింది.

ఆ తర్వాత సీఈసీ ఆ విషయంలో వివరణ అడిగింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరింది ఎన్నికల సంఘం. అయితే అందులో తన ప్రమేయం లేదని..ఏపీ డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులకే తను ఆమోదముద్ర వేసి పంపించినట్టుగా సీఎస్ వివరణ ఇచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో వ్యవహారం ఠాకూర్ కే చుట్టుకుంది. తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా అనవసరమైన వివాదాన్ని సృష్టించి - కోర్టులో ఎదురుదెబ్బ తిన్న ఠాకూర్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఢిల్లీకి పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ డీజీపీపై సంచలన ఆరోపణలు ఉన్నాయి. ఆయన బదిలీని కోరుతూ ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో… సీఈసీతో మీట్ తర్వాత ఠాకూర్ వ్యవహారం ఎటు తిరుగుతుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతూ ఉంది.