Begin typing your search above and press return to search.

పాపం గౌతం సవాంగ్...?

By:  Tupaki Desk   |   15 Feb 2022 12:30 PM GMT
పాపం గౌతం సవాంగ్...?
X
ఇలా ఎందుకు అనాల్సి వస్తోంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎపుడూ ఇలాగే అనూహ్యంగా బదిలీ వేటున పడుతూంటారు. గౌతం సవాంగ్ నిజాయతీ గల అధికారి అని అంతా అంటారు. ఆయన చంద్రబాబు సీఎం గా ఉన్న టైం లో విజయవాడ సీపీగా పనిచేశారు.

నాడు కాల్ మనీ కేసు వ్యవహారం బయటకు వచ్చినపుడు ఆయన దర్యాప్తు నిజాయతీగా చేస్తూంటే మధ్యలో సెలవులపై పంపించారు అని ప్రచారంలో ఉంది.

ఇక నాడు ఆయన వైసీపీకి బాగా నచ్చేశారు. ఇక జగన్ అధికారంలోకి రావడంతోనే ఆయన్ని ఏరి కోరి మరీ డీజీపీగా తీసుకున్నారు. మరి కొద్ది నెలల్లో మూడేళ్ళ పాలన పూర్తి అవుతుంది అనగా డీజీపీ పోస్టు నుంచి గౌతం సవాంగ్ బదిలీ అయ్యారు. చిత్రమేంటి అంటే ఆయనకు వేరే పోస్టింగ్ కూడా ఎక్కడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

నిజంగా వైసీపీ అధికారంలో ఉండగా గౌతం సవాంగ్ డీజీపీగా బాగానే పనిచేశారు. అదే టైమ్ లో ఆయన మీద విపక్షాలు తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అయితే గౌతం సవాంగ్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆయన రిటైర్ అయినా కూడా అసలు వదిలేది లేదని కూడా తేల్చి చెప్పింది.

జగన్ మీద ఎన్ని విమర్శలు టీడీపీ నేతలు చేసేవారో అంతకు సరిసమానంగా ఈ మూడేళ్లలో డీజీపీ మీద కూడా చేస్తూ వచ్చారు. ఆయన పోలీస్ యూనీఫారం వదిలేసి వైసీపీ పార్టీలో చేరిపోవాలని కూడా ఒక దశలో హాట్ హాట్ గా కామెంట్స్ చేశారు. ఇవన్నీ భరిస్తూ సహిస్తూ ఒక్కోసారి మనసు బాధపడుతున్నా విధి నిర్వహణను కఠిన‌మైన పరిస్థితుల్లో గౌతం సవాంగ్ చేశారు.

నిజంగా ఏపీలో వైసీపీకి టీడీపీకి మధ్య ఉప్పూ నిప్పులా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో డీజీపీ పోస్టు అంటే కత్తి మీద సాము లాంటిది. అయినా ఎన్నో అగ్ని పరీక్షలను తట్టుకున్న డీజీపీ చివరికి ఇలా అనూహ్యంగా పోస్ట్ నుంచి తొలగడం మాత్రం బాధాకరమే అంటున్నారు.

ఆయన సర్వీస్ మరో ఏడాది వరకూ ఉంది. నిజానికి అంతవరకూ ఆయనే డీజీపీ అని కూడా వైసీపీలో గట్టిగా వినిపించేది. కానీ ఇది రాజకీయం, ఇక్కడ అనేక ఇష్యూస్ ఉంటాయి.

పెద్ద పదవులకు అదే ఇబ్బందిగా మారుతుంది. ఏపీలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడమే డీజీపీ పదవికి ముప్పు తెచ్చింది అంటున్నారు.

చలో విజయవాడ కార్యక్రమాన్ని పూర్తిగా ఫెయిల్ చేయాలని ప్రభుత్వం పట్టుదలకు పోయి అంతా చేసిన వేళ వేలాది మంది విజయవాడ వీధుల్లో ర్యాలీ చేయడమే డీజీపీ సవాంగ్ పోస్టుకు నీళ్లు తెచ్చాయని అంటున్నారు. మరి టీడీపీ నుంచి ఎన్నో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోని మరీ మూడేళ్ళుగా తన విధూల్ను నిర్వహించిన గౌతం సవాంగ్ కి ఇపుడు ఏ వైపు నుంచి అంతగా సానుభూతి దక్కే అవకాశాలు లేవనే అంటున్నారు.

రాజకీయాల్లో ఇలాంటివి సహజం అయినా విజయవాడ సీపీగా ఉన్నపుడు సెలవులో పంపిన పార్టీ ఒకటి అయితే ఇపుడు ఏకంగా డీజీపీ పోస్టు నుంచి తొలగించిన పార్టీ మరోటి అన్న చర్చ అయితే ఉంది.

ఇక్కడ తప్పొప్పులు సంగతి పక్కన పెడితే ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉన్న వారు , అత్యున్నత‌మైన ర్యాంకుల్లో ఉన్న అధికారులు కూడా రాజకీయ క్రీనీడలను దాటి ముందుకు రాలేకపోతున్నారా అన్నదే చర్చ. ఆయన ప్లేస్ లో కొత్తగా వచ్చిన వారు కూడా ఇపుడు కత్తి మీద సాము చేయాల్సి ఉంటుంది అన్నది నిజం.