Begin typing your search above and press return to search.

కుట్ర లేదు బాబు.. డ్రోన్ మీద డీజీపీ ఫుల్ క్లారిటీ

By:  Tupaki Desk   |   19 Aug 2019 8:07 AM GMT
కుట్ర లేదు బాబు.. డ్రోన్ మీద డీజీపీ ఫుల్ క్లారిటీ
X
లోతుల్లోకి వెళ్లకుండా.. చాలా సింఫుల్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే.. కొన్ని అంశాల్ని ప్రాధమికంగా మాట్లాడుకోకుండా.. ఎక్కడెక్కడో తిరగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏదోలా చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతి పొంగి పొర్లాలని తెగ కష్టపడుతున్న తెలుగు తమ్ముళ్లకు సరైన అంశం ఏదీ దొరకని పరిస్థితి. ఇలాంటివేళ.. చంద్రబాబు అద్దెకు ఉండే ఇంటి మీద డ్రోన్ ఎగిరిన విషయం మీద గడిచిన మూడు రోజులుగా సాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

ఈ ఉదంతం వెలుగు చూసినంతనే మీడియాలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభించింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ఆయన వద్ద క్లారిటీ తీసుకున్నారు. సాధారణంగా ఒక రాష్ట్ర డీజీపీ ఈ విషయంపై వివరాలు అందించి.. వివరణ ఇచ్చినంత పని చేసినప్పుడు ఆ ఇష్యూ మీద పెద్దగా రియాక్ట్ కారు. కానీ.. అలా చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు గడిచిన మూడు రోజులుగా నానా యాగీ చేయటమే కాదు.. బుద్ధా వెంకన్న లాంటి నేతలైతే ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగేశారు.

అంతకంతకూ డ్రోన్ వివాదాన్ని పట్టుకొని కిందామీదా పడుతున్న తెలుగు తమ్ముళ్ల అవస్థల నేపథ్యంలో ఏపీ డీజీపీ స్వయంగా స్పందించారు. మీడియాను పిలిపించుకొని ఈ అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ శాఖ డ్రోన్ ఉపయోగించిందని చెప్పారు. అయితే.. స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవటంతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు.

కరకట్టకు కూతవేటు దూరం అన్నట్లుగా బాబు అద్దెకు ఉండే నివాసం ఉండటంతో.. నదీ తీరప్రాంతంలో వరద నీరు ఏ స్థాయిలో వచ్చిందన్న విషయాల్ని రికార్డు చేసే ప్రయత్నంలో భాగంగా డ్రోన్ బాబు గారింటిపైన ఎగిరి ఉంటుంది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న తమ్ముళ్లు ఎంతలా చెలరేగిపోయారో చూస్తున్నదే.

డ్రోన్ల విషయంలో ఎలాంటి కుట్ర లేదని.. దీన్ని రాజకీయం చేయొద్దని ఏపీ డీజీపీ కోరారు. ఇకపై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ డీజీపీ సవాంగ్ వ్యాఖ్యల మీద తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.