Begin typing your search above and press return to search.

జగన్ బాటలో కాళీకృష్ణ...ఏలూరుకు ఐదుగురు డిప్యూటీ మేయర్లు

By:  Tupaki Desk   |   14 March 2020 2:09 PM GMT
జగన్ బాటలో కాళీకృష్ణ...ఏలూరుకు ఐదుగురు డిప్యూటీ మేయర్లు
X
నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన శైలి కొత్తదనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాను సీఎంగా ఉండగా... మిగిలిన సామాజిక వర్గాలకు ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో డిప్యూటీ సీఎం పోస్టును కేటాయించేసి సంచలన సృష్టించారనే చెప్పాలి. ఈ తరహా కొత్త యత్నంతో వైసీపీలోని దాదాపుగా అన్ని సామాజిక వర్గాలూ సంతృప్తిగానే ఉన్నాయని చెప్పాలి. జగన్ అనుసరించిన ఈ కొత్త మంత్రం... ఆయన కేబినెట్ లో ఓ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ఏలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని)కు బాగానే అక్కరకు వచ్చిందని చెప్పాలి. అనివార్యమే అయినా... జగన్ చూపెట్టిన బాటలో నడిచిన ఆళ్ల నాని... ఏలూరు కార్పొరేషన్ కు ఏకంగా ఐదుగురు డిప్యూటీ మేయర్లను ప్రకటించేసి ఔరా అనిపించేశారు.

ఆ కథాకమామీషు చూద్దాం పదండి. స్ధానిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ కు జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులకు మంచి డిమాండ్ ఉంది. కార్పోరేషన్ లోని 50 స్ధానాలకు పోటీ చేస్తే చాలు గెలిచినట్లేనని అభ్యర్దులు భావించే పరిస్ధితి. అందుకే ఏదో రకంగా స్ధానిక ఆళ్ల నానిని ప్రసన్నం చేసుకుని చాలా మంది కార్పోరేటర్ సీట్లు సంపాదించారు. దీంతో కార్పోరేటర్ పదవులు పొందిన నేతలు ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్దిత్వం కోసం పోటీ పడటం మొదలుపెట్టారు. వైసీపీ తరఫున మేయర్ అభ్యర్ధిగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ కు మరోసారి అవకాశం దక్కింది.

అయితే ఈ పదవి కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించిన బొద్దాని శ్రీనివాస్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓ దశలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఇంటి ముందే ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. మేయర్ అభ్యర్ధిత్వానికి పోటీ పడి సీటు రాకపోవడంతో నిరాశ చెందిన బొద్దాని శ్రీనివాస్ తో పాటు మరికొందరు ఇక చేసేది లేక డిప్యూటీ మేయర్ పదవి రేసులో నిలిచారు. దీంతో డిప్యూటీ మేయర్ గా తమకు అవకాశం ఇవ్వాలంటే తమకే ఇవ్వాలంటూ దాదాపు ఆరేడుగురు తీవ్ర ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో అభ్యర్ధుల వడపోత కార్యక్రమం మొదలైంది. చివరికి ఓ ఐదుగురిని ఎంపిక చేశారు. వీరిలో ఎవరినీ తప్పించే అవకాశం లేకపోవడంతో ఐదుగురినీ డిప్యూటీ మేయర్ పదవికి అభ్యర్ధులుగా ప్రకటించారు. అయితే వీరికో మెలిక పెట్టారు. ఒకేసారి ఐదుగురికి డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి వీరిని ఏడాదికి ఒక్కరి చొప్పున అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

జగన్ బాటలో నడిచిన ఆళ్ల నాని తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఏలూరు కార్పొరేషన్ కు ఐదుగురు డిప్యూటీ మేయర్లు ఖరారైపోయారు. వీరిలో ఎవరెవరున్నారంటే... బొద్దాని శ్రీనివాస్ భార్య జయశ్రీ - సుధీర్ బాబు - గుడి చేసి శ్రీనివాసరావు - పల్లంగోళ్ల శ్రీదేవి - పైడి భీమేశ్వరరావు ఉన్నారు. వీరిలో ఒకరు ఓ ఏడాది పాటు డిప్యూటీ మేయర్ గా పనిచేసి పదవి నుంచి దిగిపోతారు. వారి తర్వాత మరొకరు డిప్యూటీ మేయర్ గా పదవీ బాధ్యతలు చేపడతారు. ఇలా ఐదేళ్ల పాటు ఐదుగురు డిప్యూటీ మేయర్లు కొనసాగుతారన్నమాట. ఈ ప్లాన్ అయితే బాగానే ఉంది గానీ.. పదవి ఎక్కే దాకా బాగానే ఉన్నా... పదవి దిగేందుకు ఆయా నేతలు ససేమిరా అంటేనే పరిస్థితి రసకందాయంలో పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఆళ్ల నాని... దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.