Begin typing your search above and press return to search.

కరోనాపై జగన్ సీరియస్ రివ్యూ.. కీలక నిర్ణయాలేమంటే?

By:  Tupaki Desk   |   20 July 2020 6:22 PM GMT
కరోనాపై జగన్ సీరియస్ రివ్యూ.. కీలక నిర్ణయాలేమంటే?
X
ఊహించని రీతిలో పెరిగిపోతున్న కరోనా కేసులతో ఏపీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కట్టుదిట్టమైన చర్యల్ని చేపడుతోంది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ నిర్వహించటంతో పాటు.. అనుక్షణం డేగకన్ను వేసే ఆరోగ్య కార్యకర్తలతో ఇంతకాలం నియంత్రించిన కేసులు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా పెరుగుతున్న కేసులకు కళ్లాలు వేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

క్యాంపు ఆఫీసులో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని.. డీజీపీ గౌతం సవాంగ్.. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా కీలక అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ విస్తరించకుండా చేపట్టిన చర్యల్ని సీఎంకు వివరించారు అధికారులు. రోజుకు 35వేల నుంచి 45 వేల వరకూ పరీక్షలు చేస్తున్నట్లుగా చెప్పారు. టెస్టుల సంఖ్య పెంచటం.. ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దులు పూర్తిగా తెరవటంతో రాకపోకలు పెరిగాయని.. అదే భారీగా కేసులు నమోదుకు కారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలు ముఖ్యమైన నిర్ణయాల్ని తీసుకున్నారు సీఎం జగన్. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను ఐదు నుంచి పదికి పెంచాలని నిర్ణయించారు. వైద్యుల మీద పని భారం లేకుండా నాణ్యమైన సేవల్ని అందించాలని నిర్ణయించారు. జిల్లాల్లో ఉన్న 84 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవల్ని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు ఇవ్వటమేకాదు.. కొత్త ఆసుపత్రుల విషయంలో ఏమేం చర్యలు తీసుకోవాలో రెండు మూడు రోజుల్లో నివేదిక తయారు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కోవిడ్ ఆసుపత్రుల్లో వీలైనంత త్వరగా వైద్యుల్ని.. సిబ్బంది నియామకం చేయాలని ఆదేశించారు.

అంతేకాదు.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. ఎవరికైనా వైరస్ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి? ఎవరిని కలవాలి? లాంటి అంశాలపై మరింత భారీగా ప్రచారం చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. కోవిడ్ అన్నది ఎవరికైనా వస్తుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైద్య సాయం కోసం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలని సీఎం జగన్ కోరారు.

క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని తెలియజేస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలని.. గ్రామ సచివాలయాల్లోనూ హోర్డింగ్స్ పెట్టాలని ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్ల కంటే కన్నా నాణ్యత మీదన దృష్టి పెట్టాలన్నారు.కాల్‌ సెంటర్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వినతుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. రానున్న మూడు.. నాలుగు నెలల పాటు నిర్దేశించుకున్న కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలన్నారు.