Begin typing your search above and press return to search.

జీవనాడిని పూర్తి చేయకుండా వైసీపీ మళ్లీ అధికారంలోకొచ్చేనా?

By:  Tupaki Desk   |   15 Jan 2023 10:00 PM IST
జీవనాడిని పూర్తి చేయకుండా వైసీపీ మళ్లీ అధికారంలోకొచ్చేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద లక్ష్యాన్నే నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా 175కి 175 సీట్లు సాధించాలని జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ శ్రేణులకు ఇదే లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆరు నెలల క్రితమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అని గడప గడపకు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. నవరత్న పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న నగదే తమను గెలిపిస్తుందని జగన్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా పింఛన్లు, డ్వాక్రా, ఇంటి స్థలాలు పొందినవారు తమకు ఓట్లేస్తారని వైసీపీ పెద్ద ఆశలే పెట్టుకుంది.

అయితే ప్రధాన లక్ష్యాలు మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉండటం వైసీపీని కలవరపరుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడిగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు. గత ఎన్నికల ప్రచార సమయంలో పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ తదితర అంశాలపై వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం జగన్‌ నిరసన దీక్షలు నిర్వహించారు.

దీంతో వైసీపీ ఘనవిజయం సాధించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదాపై ఏమీ సాధించలేకపోయింది. ప్రత్యేక హోదా పూర్తిగా అటకకెక్కింది. ఇక రైల్వే జోన్‌ కూడా రెండు అడుగులు ముందుకి.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక అన్నింటికంటే ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు కూడా పరిస్థితి కూడా ఇందుకు విరుద్ధంగా లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును చేపట్టిన కాంట్రాక్టు సంస్థలను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తప్పించింది. మళ్లీ రివర్స్‌ టెండర్లు పిలవడం.. ఇంతలో ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిపోవడం జరిగిపోయాయి. మరోవైపు కేంద్రం 2014 రాష్ట్ర విభజన జరిగేనాటికి ఉన్న అంచనా వ్యయం ప్రకారమే నిధులిస్తామంటోంది.

వైఎస్‌ జగన్‌ పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, వివిధ కేంద్ర శాఖల మంత్రులను కలసి వచ్చినా పోలవరం నిధుల మంజూరు, అంచనా వ్యయం పెంపు విషయంలో సానుకూలంగా ఫలితాలు దక్కలేదు. తాము ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి అడుగుతుండటం మినహా ఇంకేం చేయగలమని సీఎం జగన్‌ సైతం నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్టును 2021 వేసవి నాటికి పూర్తి చేస్తామని ప్రకటనలు చేసింది. నాటి జలవనరుల శాఖ మంత్రి ఈ అంశంపై పలుమార్లు గట్టిగా ప్రకటించారు. వైసీపీ నేతలు సైతం తాము పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు పోలవరం పూర్తవుతుందో చెప్పలేమని కాడి పక్కన పారేశారు.

ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ వంటి విషయాల్లో పురోగతి సాధించకుండా ఓట్లకు వెళ్తే వైసీపీకి భంగపాటు తప్పదని అంటున్నారు. కేవలం నవరత్న పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసినంత మాత్రానే గెలిచేయమని సాక్షాత్తూ ఆనం రామనారాయణరెడ్డి వంటి వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు.


సవరించిన అంచనాల ప్రకారం రూ. 57 వేల కోట్లకు కేంద్రం అంగీకరించేలా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు.. కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. జగన్‌ ప్రభుత్వం కూడా రాష్ట్ర సమస్యలపై రాజీ పడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తన కేసుల విషయంలో జగన్‌ కేంద్రానికి పూర్తిగా లొంగిపోయారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జనవరి 20న ఏపీ జలవనరుల శాఖతో కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల భేటీ ఉంది. ఈసారైనా పోలవరానికి నిధులు సాధిస్తారా లేదంటే ఎప్పుడులానే కేంద్రాన్ని మన వంతు మనం తçప్పు లేకుండా అడిగామని లైట్‌ తీసుకుంటారా అని అభిప్రాయాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణంపై బడ్జెట్‌ లో ఏమైనా చెబుతుందా? నిధుల ప్రస్తావన ఉంటుందా అనేవాటిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.