Begin typing your search above and press return to search.

సారా..నారా..వెల్ఫేర్...ఫేర్ వెల్... ఈ పంచులేంటి..?

By:  Tupaki Desk   |   25 March 2022 12:45 PM GMT
సారా..నారా..వెల్ఫేర్...ఫేర్ వెల్... ఈ పంచులేంటి..?
X
జగన్ ఏంటో బాగా మారిపోయారు అని సొంత పార్టీ వారే అంటున్నారు. బడ్జెట్ సెషన్ లో కొత్త జగన్ని చూస్తున్నామని కొందరు అంటే పాత జగన్ని మళ్ళీ చూస్తున్నామని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి అందరూ ఇప్పటిదాకా అంటే మూడేళ్ళుగా పవర్ లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ని మాత్రం కాదని తేల్చేస్తున్నారు.

జగన్ లో గతంలో లేని హుషార్, జోష్ ఈసారి బాగా కనిపించిందని అంటున్నారు. ఇక ఆయన సభలో నవ్వుతూ మాట్లాడడం, వరసబెట్టి పంచు డైలాగులు వేస్తూ సభ్యులను నవ్వించడం చేశారు. జగన్ సభలో వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు ఈసారి సభ్యులను నవ్వులలో ముంచెత్తాయి.

ఆయన పంచుల మీద పంచులు వేస్తూ ప్రత్యర్ధుల మీద తనదైన శైలిలో బాణాలు వేశారు. మద్యపానం మీద జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ నారా కాదు సారా చంద్రబాబు అనేశారు. ఇక అసెంబ్లీ చివరి రోజు కూడా బాబుని అసలు వదలలేదు. పేదలకు వెల్ఫేర్ పధకాలు పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నాం, దానికి వెల్ ఫేర్ క్యాలండర్ రెడీ చేశాం, ఈ క్యాలండర్ చంద్రబాబుకు ఫేర్ వెల్ క్యాలండర్ అంటూ మాటలను ట్విస్ట్ చేస్తూ జగన్ వేసిన పంచ్ సభలో అధికార పక్షానికి గొప్ప జోష్ ని ఇచ్చింది.

ఇక పోలవరం ఎత్తు గురించి మాట్లాడుతూ కూడా బాబు రాజాకీయంగా ఎదగకుండా ఎత్తు తగ్గించేస్తామని జగన్ అన్న మాటలూ హైలెట్ అయ్యాయి. అలాగే పోలవరం ఎత్తు తగ్గించామని ఎవరు చెప్పారు, ఈనాడు రామోజీరావుకు మోడీ ఫోన్ చేసి చెప్పారా. ఆంధ్రా జ్యోతి రాధాక్రిష్ణకు కేంద్ర మంత్రి షెకావత్ చెప్పారా అంటూ జగన్ వారిని అనుకరిస్తూ మాట్లాడిన తీరు కూడా నవ్వులను పూయించింది.

ఇక మద్యం బ్రాండ్స్ అన్నీ జే బ్రాండ్స్ కాదు చంద్రబాబు బ్రాండ్స్ సీ బ్రాండ్స్ అని పంచులేసిన జగన్ సొంత పార్టీ వారికి కావాల్సిన ఆనందాన్ని అందించారు. వైసీఎల్పీ సమావేశంలో కూడా చంద్రబాబు నథింగ్ అంటూ ఆయన లైట్ తీస్కోమని చెప్పడం కూడా ప్రత్యర్ధి పార్టీకి మంట పుట్టిస్తే వైసీపీకి ధీమా పెంచింది.

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ మారిపోయారా అన్న చర్చ కూడా వస్తోంది. ఎపుడూ సీరియస్ గా ఉండడమే కాదు, సభలో ఆయన ప్రసంగం కూడా పూర్తిగా సబ్జెక్ట్ మీదనే వెళ్తుంది తప్ప పంచులు ఉండవు. అలాంటి జగన్ ఇపుడు జోరు పెంచేశారు. ఇదంతా వచ్చే రెండేళ్ళలో ఎన్నికలు ఉన్నందునే అంటున్నారు.

పార్టీ క్యాడర్ కి ధైర్యాన్ని నింపడంతో పాటు ప్రత్యర్ధులకు చెక్ చెప్పడానికే జగన్ ఇలా పంచుల పదనిసలకు తెరతీశారని అంటున్నారు. అంతే కాదు, వైసీపీ ప్లీనరీ అయిన తరువాత జనాల్లోకి జగన్ రావాలనుకుంటున్నారుట. మరి అపుడు ప్రసంగాల్లో ఇంకెన్ని పంచులు పేల్చుతారో అన్న ఉత్కంఠ అయితే అధికార పక్షంలో ఉంది మరి.