Begin typing your search above and press return to search.

అమరావతి నిర్మాణానికి నలభయ్యేళ్ళు అవుతుందా..?

By:  Tupaki Desk   |   24 March 2022 5:30 PM GMT
అమరావతి నిర్మాణానికి నలభయ్యేళ్ళు అవుతుందా..?
X
పాపం చంద్రబాబు ముచ్చట పడిన రాజధాని అమరావతి. ఆయన అయిదేళ్ల పాలనలో దేశ దేశాలు తిరిగి బ్లూ ప్రింట్ ని అన్ని రకాలుగా మార్పులు చేసి మరీ అమరావతి రాజధానికి గుది గుచ్చారు. అమరావతిని విశ్వ నగరం అన్నారు. ప్రపంచ రాజధానిని తాము నిర్మిస్తున్నామని నాడు భారీగా ప్రకటనలు చేశారు.

నవ నగరాలు, ఎన్నో నిర్మాణాలు దాదాపుగా యాభై వేల ఎకరాల భూమి, ఇంకా అనుకూలిస్తే మరిన్ని వేల ఎకరాలను సమీకరించ్దేందుకు వీలుగా ప్రణాళికలు. ఇదీ అమరావతి రాజధాని వెనక ఉన్న కధ. నిజంగా అమరావతి అంతటి నగరం అయితే అందరికీ సంతోషమే.

కానీ ఏపీ వంటి అన్ని విధాలుగా కునారిల్లిన రాష్ట్రానికి అమరావతి రాజధానిని ఇంత పెద్ద ఎత్తున నిర్మించడం అంటే సాధ్యమా అన్నది ఒక అతి పెద్ద ప్రశ్న. ఇక అమరావతి రాజధాని కలలో కూడా లేని సమయాన, ఇంకా ఏపీ విభజన కూడా కాని రోజున చంద్రబాబు ఉమ్మడి టీడీపీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా నాడు చెప్పిన మాట ఏంటి అంటే ఏపీలో కొత్త రాజధాని నిర్మాణానికి ఏకంగా నాలుగైదు లక్షల కోట్ల రూపాయాలు ఖర్చు అవుతుందని. అది 2012 ప్రాంతంలొ చెప్పిన మాట.

మరి ఇప్పటికి పదేళ్ళ క్రితం నాటి మాట. మరి టీడీపీ ఏలుబడిలో అయితే లక్షల కోట్లు అవసరం అని చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనేక సార్లు చెప్పారు. నాడు బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీ ఏపీలో పర్యటించినపుడు ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలా అనుకున్నా కూడా లక్షల కోట్ల వ్యవహారమే. కానీ బీజేపీ నాయకులే స్వయంగా చెప్పిన లెక్కలను తీసుకుంటే అమరావతికి ఈ రోజు దాకా నికరంగా ఇచ్చినది ఏడున్నర వేల కోట్లు మాత్రమే.

అదే విధంగా చంద్రబాబు హయాంలో కొన్ని టెంపరరీ భవనాల పేరిట నిర్మించారు. మిగిలిన వాటికి ప్రతిపాదనలు సిధ్ధం చేసి ఉంచారు. టీడీపీ దిగిపోయి జగన్ వచ్చారు. తొలి ఆరు నెలలూ ఆయన అమరావతి గురించి పెద్దగా మాట్లాడలేదు.

కానీ 2019 డిసెంబర్ లో జరిగిన శీతాకాల సమావేశాల్లో మాత్రం మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. 2020 లో మూడు రాజధానుల మీద చట్టం చేశారు. ఆ మీదట అది కోర్టుకు వెళ్ళడం, తుది తీర్పు రావడం అంతా తెలిసిందే.

ఇక్కడ విషయం అది కాదు, చంద్రబాబు సర్కార్ పేర్కొన్నట్లుగా బ్లూ ప్రింట్ ని తీసుకుని నవ నగరాలతో అమరావతి రాజధాని నిర్మించడం సాధ్యమా. అది కూడా తక్కువ వ్యవధిలో అన్నది. అలా కుదరదు అని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో చెబుతున్నారు. ఆయన అంటున్నది ఏంటంటే అమరావతి రాజధని నిర్మాణానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని, ఏకంగా నలభయ్యేళ్ళ సమయం పడుతుందని.

ఇక చంద్రబాబు చెబుతున్నట్లుగా హైదరాబాద్ రాజధానిని మించేలా నిర్మించాలీ అంటే ఏకంగా వందల ఏళ్ళు పడుతుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు అయితే అమరావతిని సులువుగానే నిర్మించవచ్చు అంటున్నారు.

తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయవచ్చు అంటున్నారు. అన్నీ చెప్పిన బాబు, ఎంతో పలుకుబడి ఉన్న ఆయన తన హయాంలో గొప్పగా చేసింది లేదు. మరి అమరావతి బదులుగా మూడు రాజధానులు అంటున్న జగన్ ఈ విషయంలో చేస్తారు అనుకోవడమూ భ్రమలే.

అన్నింటికీ మించి ఏపీ ఆర్ధిక పరిస్థితులు చూసినా దానికి సహకరించవు. మరి చంద్రబాబు అయినా జగన్ అయినా అమరావతిని బ్లూ ప్రింట్ మేరకు నిర్మించగలరా. ఇది జనాలకు కలుగుతున్న సందేహం. ఆ డౌట్ తీరేది కాదు, ఈ రాజకీయం ఆగేదీ కాదు.