Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ గరంగరం... రీజనేంటంటే?

By:  Tupaki Desk   |   28 Jan 2020 3:35 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ గరంగరం... రీజనేంటంటే?
X
ఏపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని తలచింది. సోమవారం ఉదయం కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం వైఎస్ జగన్... మండలి రద్దుపై తీర్మానం ప్రతిపాదించి వెంటనే ఆమోదం తెలిపేశారు. ఆ వెంటనే అసెంబ్లీకి వచ్చి మండలి రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. స్వయంగా తానే సదరు బిల్లును ప్రవేశపెట్టారంటే... జగన్ కు అది ఎంత కీలకమైన బిల్లో ఇట్టే చెప్పేయొచ్చు. అయితే ఆ బిల్లుపై సుదీర్ఘ చర్చ తర్వాత స్పీకర్ ఓటింగ్ కు అనుమతించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా 133 ఓట్లు మాత్రమే పడ్డాయి. అదేంటీ... వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151 కదా. స్పీకర్ ఓటును పక్కనపెడితే... 150 ఓట్లు పడాలి కదా. అంతేకాకుండా జనసేన సింగిల్ ఎమ్మెల్యే రాపాక కూడా వైసీపీకే ఓటేశారు. అంటే 151 ఓట్లు రావాలి కదా. మరి 133 ఓట్లే ఎందుకు వచ్చాయి. అంటే... వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏకంగా 18 మంది సోమవారం సభకు డుమ్మా కొట్టారన్న మాట. అదే జగన్ ను తీవ్ర అసహనానికి గురి చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పడింది.

అసలే అది కీలక బిల్లు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలకంగా భావిస్తున్న బిల్లు అది. అసెంబ్లీలో మూడొంతుల్లో రెండు వంతుల కంటే అధికంగా ఎమ్మెల్యేలను కలిగిన తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను టీడీపీ ఆధిపత్యం కొనసాగుతున్న శాసన మండలి పదే పదే బ్రేకులేస్తున్నది. ఏం చేయాలి? సర్దుకోమని చెప్పి చూశారు. టీడీపీ వినలేదు. ఇక మండలి రద్దు ఒక్కటే మార్గం. నిజమే... ప్రజా సంక్షేమం కోసం జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలను టీడీపీ మండలి వేదికగా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోంది. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే టీడీపీ వ్యవహరిస్తున్న తీరుతో మండలిని రద్దు చేస్తే తప్పించి టీడీపీకి బుద్ధి రాదని జగన్ తేల్చేసుకున్నారు. అంతేకాకుండా ఎంతమాత్రం అవసరం లేని మండలి కోసం ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేయడమెందుకు? అని కూడా జగన్ నిర్ణయించుకున్నారు. అనుకున్నంతనే మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

సో... ఇలాంటి సమయం జగన్ కే కాకుండా మొత్తంగా వైసీపీకి అత్యంత కీలకమైన సమయమే కదా. మరి ఇలాంటి కీలక సమయంలో సభకు హాజరు కాకుండా ఏకంగా 18 మంది డుమ్మా కొడితే.. అది కూడా ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే సభకు డుమ్మాకొడితే జగన్ కు కోపం రాకుండా ఎందుకుంటుంది? ఒకేసారి... అది కూడా ప్రభుత్వానికే కాకుండా పార్టీకి కూడా కీలకంగా మారిన సమయంలో సభకు 18 మంది శాసనసభ్యులు డుమ్మా కొడితే... ఏ పార్టీ అదినేతకు అయినా ఎందుకు కోపం రాదు? అందుకే జగన్ కూ కోపం వచ్చేసింది. వెంటనే పార్టీ విప్ లను పిలిపించి చెడామడా వాయించేశారట. కీలక సమయంలో 18 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా ఉంటే ఎలా? అయినా ఈ విషయంలో అంత సీరియస్ లేకుంటే ఎలా? ఇదే పరిస్థితి మరోమారు పునరావృతమైతే సహించేది లేదని కాస్తంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. అంతేకాకుండా కీలక సమయంలో సభకు గైర్హాజరైన వారెవరు అంటూ జగన్ ఆరా తీయడంతో విప్ లు నీళ్లు నమిలారట.