Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

By:  Tupaki Desk   |   22 March 2020 4:00 PM IST
ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం
X
కరోనా వైరస్ తీవ్రతను కొంచెం ఆలస్యంగా అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రభుత్వం.. ఇంతకుముందే స్కూళ్లు, కళాశాలలు మూసేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో థియేటర్లు, మాల్స్ ఆదివారం స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తి స్థాయిలో షట్ డౌన్ చూడబోతున్నాం. ఈలోపు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంతో పాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తే.. రెండో బృందం తర్వాత వారం విధులకు వచ్చేలా పని విధానాన్ని మలు చేయనున్నారు.

అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల్ని నియంత్రించాలని, అత్యవసర పని ఉంటే తప్ప అనుమతించవద్దని ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్ కంటే పైస్థాయి అధికారులు రోజూ విధులకు హాజరవుతారు. అయితే వీరికి పని వేళలో షరతులు విధించారు. ఒక బృందం ఉదయం.9.30 గంటలకు, రెండో బృందం 10 గంటలకు, మూడో బృందం 10.30 గంటలకు కార్యాలయంలోనికి అనుమతిస్తూ ఏ సెక్షన్‌లోనూ రద్దీ లేకుండా ఉద్యోగుల మధ్య తగినంత దూరం పాటించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కింది స్థాయి ఉద్యోగులకు వంతులవారీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రైవేటు సంస్థల్లో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పెద్ద ఎత్తున నడుస్తున్న సంగతి తెలిసిందే.