Begin typing your search above and press return to search.

బాబుకు..జగన్ కు తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది

By:  Tupaki Desk   |   23 Oct 2019 8:13 AM GMT
బాబుకు..జగన్ కు తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది
X
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అదే పనిగా డబ్బా కొట్టుకోవటం టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు చూస్తుంటాం. ఎంత అనుభవం ఉంటే మాత్రం.. సమర్థత లేకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి బాబుకు ఎదురైంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో వరుస పెట్టి భేటీలు పెట్టటమే కానీ.. ఇష్యూను క్లోజ్ చేయలేకపోవటం ఒక ఎత్తు అయితే.. అలాంటి ఇష్యూను ఏపీ సీఎం జగన్ మాత్రం ఒక్కటంటే ఒక్క భేటీలోనే తేల్చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

సమస్యను అదే పనిగా చర్చల పేరుతో నానుస్తూ.. నిర్ణయం తీసుకునే విషయంలో ధైర్యం ప్రదర్శించని వైనానికి భిన్నంగా జగన్ తీరు ఉందని చెప్పాలి. ఐదేళ్లలో బాబు తేల్చలేని విషయాన్ని.. తాను ఇష్యూ టేకప్ చేసిన ఇరవై రోజుల్లో క్లోజ్ చేసిన జగన్ సమర్థత మీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వంశపారంపర్య అర్చకత్వ హక్కుల్ని కొనసాగిస్తూ 2017లో జీవోను విడుదల చేసింది నాటి బాబు సర్కారు. అయితే.. ఫైనల్ గా అఫ్రూవల్ చేసిన అర్డర్ ను నోటిషికేషన్ జారీ చేయాలంటూ బ్రాహ్మణ సంఘాలు మొదలు కొని టీడీపీ బ్రాహ్మణ నేతలు చెప్పులు అరిగే వరకూ తిరిగినా.. ఫలితం లేకుండా పోయింది. నేతల మాటల కంటే కూడా అధికారుల మాటల్ని గుడ్డిగా నమ్మే బాబు.. అనవసర భయాలతో ఆర్డర్ జారీ చేయలేదు. దీంతో.. నోటి దాకా వచ్చిన ముద్దు నోట్లోకి వెళ్లని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాను పాదయాత్ర చేసిన సందర్భంలో ఆర్చకుల సమస్యను తాను పరిష్కరిస్తానని మాట ఇచ్చిన జగన్.. తాను పవర్లోకి వచ్చిన తర్వాత మరోసారి ఆర్చక సంఘాలకు తేల్చేస్తానని మాట ఇచ్చారు. ఈ ఇష్యూను క్లోజ్ చేయాలంటే ఏం చేయాలన్న అంశంపై వరుస పెట్టి సమీక్షలు నిర్వహించి.. ఎలాంటి చిక్కులు లేకుండా జీవోను జారీ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు.

అనవసరమైన భయాల్ని వ్యక్తం చేసిన వారని అడ్డుకుంటూ.. సమస్య పరిష్కార దిశగా పని చేసే వారిని ప్రోత్సహించారు జగన్. ఈ కారణంగా ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమ సమస్యల్ని గుర్తు చేసిన అర్చకులకు కేవలం 20 రోజుల వ్యవధిలో వారు కోరుకున్నట్లు జీవో విడుదలైంది. దీంతో.. బ్రాహ్మణులు.. ముఖ్యంగా అర్చకత్వంలో ఉన్న వారికి జగన్ కనిపించే దేవుడిగా మారిపోయారు. ఏళ్లకు ఏళ్లు అనుభవం ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. సమర్థత చాలా అవసరమన్న విషయాన్ని జగన్ తన చేతలతో చెప్పేశారని చెప్పాలి.