Begin typing your search above and press return to search.

అదానీకే గంగ‘వరం’.. కేబినెట్ లో డిసైడ్ చేసిన సీఎం జగన్!

By:  Tupaki Desk   |   7 Aug 2021 7:59 PM IST
అదానీకే గంగ‘వరం’.. కేబినెట్ లో డిసైడ్ చేసిన సీఎం జగన్!
X
దేశంలోని ప్రధాన పోర్టులన్ని ఒకటి తర్వాత ఒకటిగా తన సొంతం చేసుకుంటున్న గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్.. గడిచిన కొద్దికాలంగా గంగవరం పోర్టు మీద ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ విషయంలో ఇప్పటికే విజయం సాధించిన అదానీ గ్రూప్.. తాజాగా ఏపీ ప్రభుత్వం తన వాటాను సొంతం చేసుకోవటానికి వీలుగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వం తన వాటాను అమ్మేసేందుకు వీలుగా.. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

గంగవరం సముద్ర తీరాన పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 1800 ఎకరాల్ని ఇచ్చింది. ఇందుకు ప్రతిగా ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఇచ్చారు. ఈ ఖరీదైన వాటాను ప్రభుత్వం అదానీ గ్రూపునకు కేవలం రూ.645 కోట్లకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నంలో ఇప్పుడు భూముల విలువభారీగా పెరగటం తెలిసిందే. అలాంటి వేళ.. తక్కువ ధరకే ప్రభుత్వం తన వాటాను ఇచ్చేస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల వాదన ప్రకారం గంగవరంలో ప్రస్తుతం ఎకరా రూ.5 కోట్లు ఉందని భావిస్తున్నా.. ప్రభుత్వం పరిధిలో ఉన్న వాటా ప్రకారం రూ.9వేల కోట్ల వరకు విలువైన భూమి ఉందని చెబుతున్నారు. అంత విలువైన భూమిని కేవలం రూ.645 కోట్లకు ఓకే చెప్పటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంటున్న ఏపీ సర్కారు.. అందులోని నుంచి బయటపడేందుకు తాజా డీల్ పనికి వస్తుందని చెబుతున్నా.. డీల్ విలువ తక్కువగా ఉండటం రాజకీయ రచ్చకు తెర తీసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.