Begin typing your search above and press return to search.

కేంద్రం దెబ్బ‌కు దిగొచ్చిన జ‌గ‌న్‌.. మూడుపై వెన‌క్కి!

By:  Tupaki Desk   |   22 Nov 2021 6:50 AM GMT
కేంద్రం దెబ్బ‌కు దిగొచ్చిన జ‌గ‌న్‌.. మూడుపై వెన‌క్కి!
X
మాట త‌ప్పేది లేదు.. మ‌డ‌మ తిప్పేది లేదంటూ.. భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు చేసిన ఏపీముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి త‌లొగ్గ‌క త‌ప్ప‌లేదు. అదేస‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు స‌హ‌క‌రిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం కూడా.. భారీగానే జ‌గ‌న్‌కు షాకిచ్చింద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మూడు రాజ‌ధానుల బిల్లు(వికేంద్రీక‌ర‌ణ‌), ఏపీ సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. అయితే.. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈవిష‌యాన్ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ఎస్ .శ్రీరాం హైకోర్టుకు తెలిపారు.

అయితే.. జ‌గ‌న్ ఆక‌స్మిక నిర్ణ‌యం వెనుక జ‌రిగింది ఏంటి? అస‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌గ్గేదేలే! అని చెప్పిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌డానికి కార‌ణం ఏంటి? అనే విష‌యాల‌పై ఆసక్తి పెరిగింది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఇప్ప‌టికే మూడు రైతు చ‌ట్టాల‌పై వెనక్కి త‌గ్గింది. రైతుల‌కు వ్య‌తిరేకంగా ఏదీ చేయ‌రాద‌ని లెంప‌లు వేసుకుంది. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి విష‌యం నేరుగా కేంద్రానికి చెందిన అంశం కాక‌పోయినా.. రాజ‌ధానికి శంకుస్థాప‌న చేసింది మోడీనే క‌నుక‌.. రాష్ట్రానికి ఒక రాజ‌ధాని ఉండాల‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయాల్సింది కూడా కేంద్రమే క‌నుక‌.. ప‌రోక్షంగా ఇక్క‌డ ఏం జ‌రిగినా.. మోడీపైనే విమ‌ర్శ‌లు వ‌స్తాయి.

ఇలాంటి విమ‌ర్శ‌ల‌పై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు కాల్చుకున్న‌ది చాలు.. ఇక‌.. ఎందుకు వ్య‌తిరేక‌త అని నిర్ధారించుకుని ఉంటారు. మ‌రో రెండేళ్లేలోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో కీల‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగుల వేశారు. దీనిలో భాగంగానే మూడు సాగు చ‌ట్టాలుర‌ద్దు చేసిన‌ట్టే.. అమ‌రావ‌తికి ఇప్ప‌టి వ‌ర‌కు దూరంగా ఉండి.. ఇప్పుడు అనూహ్య మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీనికితోడు..ఇ టీవ‌ల ఏపీలో ప‌ర్య‌టించిన‌.. కేంద్ర బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. అమిత్ షా కూడా సీఎం జ‌గ‌న్‌కు ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని అంటున్నారు. రాజ‌ధాని ఒకటే ఉంచాల‌ని.. ఇలా వివాదాలు చేసుకోవ‌డం ఎందుకు? అని ఆయ‌న త‌లంటి ఉంటార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యంతీసుకుని వెన‌క్కి త‌గ్గి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.