Begin typing your search above and press return to search.

ప్రమాణస్వీకారం చేయని జగన్ ఎంపీ.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   23 July 2020 7:13 AM GMT
ప్రమాణస్వీకారం చేయని జగన్ ఎంపీ.. ఎందుకంటే?
X
కొన్ని సందర్భాల్లో అనవసరమైన అంశాలకు భారీ ప్రాధాన్యం దక్కుతుంది. అందుకు భిన్నంగా మరికొన్నిసార్లు మాత్రం అసలు ఎవరికి పట్టని రీతిలో కవర్ చేయటం మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓవైపు అమరావతిలో కొత్త మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయానికి కాస్త అటూ ఇటుగా ఢిల్లీలో అదే పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. దీంతో.. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం ఆరుకు పెరిగింది.

ప్రమాణం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ముగ్గురు కొత్త ఎంపీల నోట వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. అధికారంలోకి రావటానికి ముందు.. వచ్చిన కొద్ది రోజుల పాటు ఏపీకి ప్రత్యేక హోదా గురించి పదే పదే మాట్లాడిన అధినేతకు భిన్నంగా వారి మాటలు ఉండటం గమనార్హం విభజన చట్టంలోని హామీలన్ని అమలు అయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వ్యాఖ్యానించారు.

కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల్నిపూర్తి చేసేలా.. మోడీ సర్కారుపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కేంద్ర విధానాలు రాష్ట్రానికి అనుసంధానం చేసుకొని రాజ్యసభ వేదికపై సమస్యలపై చర్చిస్తామని చెప్పిన జగన్ పార్టీ సభ్యులు.. ఏపీకి కీలకమైన హోదా విషయాన్ని మాట మాత్రమైనా ప్రస్తావించకపోవటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు పక్కా ప్లాన్ తోనే స్క్రిప్టు వర్కు జరిగిందని చెబుతున్నారు. జగన్ సర్కారుకు సలహాదారులుగా వ్యవహరించే వారిలో కీలకమైన వ్యక్తి సూచనకు తగ్గట్లే కొత్త ఎంపీల మాటలు ఉన్నట్లుగా చెబుతున్నారు. హోదా తప్పించి అన్ని మాటలు మాట్లాడిన ఎంపీల తీరు చూస్తే.. ఆ అంశానికి వారిచ్చే ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమవుతుందని చెప్పక తప్పదు.