Begin typing your search above and press return to search.

జగన్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   6 Sep 2021 5:34 AM GMT
జగన్ కీలక నిర్ణయం
X
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళల్లో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక రంగానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక రంగ వ్యవహారాల్లో నిపుణుడైన గుర్ గావ్ కు చెందిన రజనీష్ కుమార్ ను ఏపి ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇప్పటివరకు ఆర్థిక రంగానికి సంబంధించి ప్రత్యేకంగా నిపుణులు ఎవరు సలహాదారుగా లేరు. రజనీష్ గతంలో కెనడా, యూకే ప్రభుత్వాల్లోని ఆర్థిక రంగాల్లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఈయనకు ప్రాజెక్ట్స్, రుణ వ్యవహారాలు, రిటైల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో అపారమైన అనుభవం ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన ఆర్థికరంగ సలహాదారుల్లో రజనీ కూడా ఒకరు. కాబట్టి ఇప్పుడు ఆయన నియామకం, సలహాలు ప్రభుత్వానికి చాలా అవసరమనే చెప్పాలి. లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి ఆయన సలహాలు ఏ విధంగా ఉపశమనం కలిగిస్తుందో కొంతకాలం అయితే కానీ తెలీదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబినుండి రజనీష్ కాపాడగలరా లేదా అన్నది తెలియదు కానీ సరైన వ్యక్తినే జగన్ సలహాదారుగా ఎంచుకున్న విషయం తెలుస్తోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ తో మొదలైన ఏపి ప్రభుత్వం ముందు చంద్రబాబునాయుడు ఇఫుడు జగన్ విధానాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోందన్నది అందరికీ తెలిసిందే.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందినే సలహాదారులుగా నియమించుకున్నారు. అయితే వీరిలో ఎంతమంది వల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందో ప్రభుత్వమే చెప్పాలి. చంద్రబాబు హయాంలో కన్సల్టెంట్ల పేరుతో నియామకాలు జరిగితే ఇపుడు సలహాదారుల పేరుతో నియామకాలు జరుగుతున్నాయంతే. తమకు అత్యంత సన్నిహితులను, పార్టీకి సేవలందించిన వారిని ప్రభుత్వంలో ఏదో స్థాయిలో వివిధ రకాల పోస్టుల్లో నియమించుకుంటున్నారు.

వీరిలో అత్యధికులు ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకోవడానికి, ప్రభుత్వ సౌకర్యాలు పొందడానికి తప్ప మరెందుకు ఉపయోగపడరు. అయినా వారిని జగన్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పోస్టులు రాజకీయ అనివార్యతల్లోకి వస్తాయి. కాబట్టి అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో పేరున్న నిపుణుడు రజనీష్ కుమార్ ను ఇప్పుడు సలహాదారునిగా తీసుకోవటమంటే జగన్ తెలివైన పనిచేశారనే చెప్పాలి. ఆదాయాలు పెంచుకోవటంలో తగిన చొరవ చూపకుండా కేవలం అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని లాక్కురాలేమన్న విషయం అర్ధం చేసుకున్నట్లుంది. మరి తాజాగా నియమితుడైన రజనీష్ సలహాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిందే.