Begin typing your search above and press return to search.

జగన్ మరో హామీ అమలు..ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్!

By:  Tupaki Desk   |   8 Aug 2019 4:36 PM GMT
జగన్ మరో హామీ అమలు..ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్!
X
‘మాట తప్పం - మడమ తిప్పం‘ అంటూ పదే పదే చెప్పే వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా తిరక్కుండానే... పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో 80 శాతాన్ని అమల్లో పెట్టేసిన జగన్... ఇప్పుడు ఇంకో కీలక హామీని అమల్లోకి తీసుకొచ్చేశారు. ఈ హామీ అమలుతో రాష్ట్రంలో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న 43 వేల మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ఆశాల వేతనాలను రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్లుగా జగన్ ఇదివరకే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని అమల్లోకి తీసుకొచ్చేసిన జగన్ సర్కారు... గురువారం సాయంత్రం ఆశా వర్కర్ల వేతనాల పెంపునకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసిన ఆశా వర్కర్లు తమకు అందుతున్న వేతనం, తాము చేస్తున్న సేవలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న తమకు ఇస్తున్న వేతనం సరిపోవడం లేదని - తమ కష్టాన్ని గుర్తించి వేతనం పెరిగేలా చూడాలని కోరారు. వారి డిమాండ్ ను విన్న జగన్... అక్కడికక్కడే తాను అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. తాను అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చిన జగన్... ఇప్పుడు ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ వినిపించారు. ఆశా వర్కర్ల వేతనాలను రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయించారు. పెంచిన వేతనాలను ఆగస్టు నెల నుంచే అమలు చేయనున్నట్లు కూడా సదరు ఉత్తర్వుల్లో జగన్ సర్కారు చాలా స్పష్టంగా పేర్కొంది.

ఇదిలా ఉంటే... టీడీపీ హయాంలో ఆశాలకు రూ.3 వేల వేతనంతో పాటు మరో రూ.3 వేల ఇన్ సెంటివ్ లభించేది. దానికి అదనంగా పనితీరును ఆదారం చేసుకుని మరో రూ.2,600 ఇన్ సెంటివ్ కూడా వచ్చేది. ఇలా టీడీపీ సర్కారు పెట్టిన టార్గెట్లను చేరుకున్న వారికి రూ.8,600 లభించేది. అయితే ఇప్పుడు టీడీపీ సర్కారు అమలు చేసిన వేతనం, జనరల్ ఇన్ సెంటివ్ లతో కలిసి వచ్చే రూ.6 వేలను జగన్ సర్కారు రూ.10 వేలకు పెంచింది. ఇక పనితీరు ఆధారంగా టీడీపీ అమలు చేసిన రూ.2,600 ఇన్ సెంటివ్ ను జగన్ సర్కారు అమలు చేస్తే... ఆశాలకు ఇప్పుడు ఏకంగా 12,600ల వేతనాన్ని అందుకుంటారు. మరి దీనిపై జగన్ సర్కారు ఏమంటుందో చూడాలి. అయితే ఎలాంటి షరతులతో కూడిన ఇన్ సెంటివ్ లు లేకుండానే రూ.10 వేల వేతనం లభించేలా జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం వారికి గుడ్ న్యూసే కదా.