Begin typing your search above and press return to search.

సెలవుపై వెళ్లిన ద్వివేదీ.. కేబినెట్ భేటీకి లింక్?

By:  Tupaki Desk   |   10 May 2019 5:37 PM GMT
సెలవుపై వెళ్లిన ద్వివేదీ.. కేబినెట్ భేటీకి లింక్?
X
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి బహుశా అన్ని వ్యవహారాలనూ చూసుకొంటూ, నేతల ఫిర్యాదులను తీసుకొంటూ - వారు మాట్లాడే మాటలను భరిస్తూ వస్తున్నారు గోపాలకృష్ణ ద్వివేదీ. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర పరిమితమే అయినా.. ద్విదేవీకి వర్క్ టెన్షన్ అయితే సహజంగానే ఉంటుంది. ఆ పై ఈ సారి చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి మామూలుగా లేదు.

ద్వివేదీ మీద విరుచుకుపడినంత పని చేశారు ఆయన. డైరెక్టుగా సచివాలయంలో ద్వివేదీ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లి చంద్రబాబు నాయుడు ఆయనపై ఫైర్ అయ్యారు. బాబు తీరు వివాదాస్పదం అయ్యింది. ద్వివేదీని బాబు ఏమేం అన్నారో మొత్తం ట్రాన్స్ లేట్ చేసి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా కోరిన విషయం తెలిసిందే. పోలింగ్ కు ముందు - పోలింగ్ తర్వాత అనేది లేకుండా ఈ సారి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈసీని లక్ష్యంగా చేసుకున్నారు.

ఇక ఇప్పుడు కూడా ఈసీ మీద బాబు ఫైర్ అవుతూనే ఉన్నారు. మరోవైపు కేబినెట్ భేటీ అంశం పెండింగ్ లోనే ఉంది. ఎలాగైనా కేబినెట్ ను సమావేశ పరచాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకు అనేక రకాలుగా ఆయన పోరాడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సీఈసీ వద్ద పెండింగ్ లో ఉంది.

ఇలాంటి సమయంలో ద్వివేదీ సెలవు మీద వెళ్లడం ఆసక్తిదాయకంగా మారింది! ఈ శనివారం నుంచి ఐదు రోజుల పాటు ద్వివేది సెలవు మీద ఉంటారని సమాచారం. ద్వివేది సెలవు ఈ నెల పదిహేనుతో ముగుస్తుందని వార్తలు వస్తున్నాయి. అంత వరకూ ఆయన విధులకు దూరంగా ఉంటారని తెలుస్తోంది.

దీంతో ఏపీ కేబినెట్ సమావేశం గురించి కూడా తదుపరి కార్యాచరణ ఆగిపోయినట్టే అని వార్తలు వస్తున్నాయి. ద్వివేదీ వర్క్ లో ఉండి ఉంటే.. కేబినెట్ భేటీకి అనుమతులు గట్రా వేగంగా వచ్చేవని ఆయన ఐదు రోజుల పాటు సెలవులో ఉండటంతో కేబినెట్ భేటీ వ్యవహారాలపై కదలికలు కూడా ఐదు రోజుల తర్వాతే అనే మాట వినిపిస్తూ ఉంది!