Begin typing your search above and press return to search.

రాజధాని ట్రబుల్స్... వైసీపీలో కొత్త గుబుల్స్

By:  Tupaki Desk   |   16 Nov 2022 12:30 AM GMT
రాజధాని ట్రబుల్స్... వైసీపీలో కొత్త గుబుల్స్
X
మూడు రాజధానులు అంటూ ఒక గంభీరమైన నినాదాన్ని వైసీపీ ఇచ్చింది. దాని కోసం అసెంబ్లీలో చట్టాన్ని కూడా చేసింది. అయితే ఆ తరువాత అది న్యాయ సమీక్ష ముందు వీగిపోతుందని భావించి తానుగానే రద్దు చేసుకుంది. అనుకున్నట్లుగానే హై కోర్టు అమరావతి ఏకైక రాజధాని అని ఈ మార్చిలో తీర్పు ఇచ్చింది. దాని మీద వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్ళని ఏపీ ప్రభుత్వం ఆరు నెలలు ఆలస్యంగా అత్యున్నత న్యాయ స్థానం తలుపు తట్టింది.

అదే సమయంలో దీన్ని అత్యవసర వ్యాజ్యంగా భావించి విచారణ జరపాలని ప్రభుత్వం కోర్టుని అభ్యర్ధించింది. అయితే ఆరు నెలలు ఆలస్యం చేసి మరీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం ఇపుడు అత్యవసరం అనడంలో అర్ధం లేదని కోర్టు వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దాంతో దీనిని తాపీగానే లోతైన విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.

ఇక ఈ నెల 1న ఈ కేసు విచారణకు లిస్ట్ అయితే అప్పటి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఆ మీదట 14నకు విచారణకు వచ్చింది. అది వాయిదా పడి ఈ నెల 28కి విచారణకు వచ్చింది. ఈ కేసులో అడ్డగోలు విభజనగా ఏపీని చేశారు అన్న దాని మీద దాఖలైన దాదాపు పాతిక పిటిషన్లను కూడా కలిపి విచారణ చేపట్టాలని మొదట అనుకున్నారు.

అయితే తాజా విచారణలో వాటిని వేరు చేయాలని నిర్ణయించారు. ఇక అమరావతి రాజధాని మీద పదికి పైగా పిటిషన్లు అనుకూలంగా వ్యతిరేకంగా పడ్డాయి. వీటిని విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్నా ఈ కేసులో తీర్పు వచ్చేటప్పటికి జాప్యం అవుతుంది అని అంటున్నారు.

హై కోర్టులో చూసుకుంటే అమరావతి రాజధాని విచారణ రెండేళ్ల పాటు సాగింది. ఇపుడు సుప్రీం కోర్టులో వాయిదాలు పడుతూ ఈ కేసు విచారణ సంపూర్ణంగా జరిగి తీర్పు రావాలీ అంటే కచ్చితంగా సుదీర్ఘ కాలమే పడుతుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల అజెండాగా చేసుకుని 2024లో వెళ్లాలని ఆలా లాభపడాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే కోర్టులో ఈ అంశం ఉంది. తీర్పు వచ్చే వరకూ ఏమీ చేయడానికి వీలు లేదు. మరో వైపు సీఎం ఆఫీస్ విశాఖకు తరలించాలని చూస్తున్నా దాని వెనక ఏ ఇబ్బందులు ఉంటాయో కూడా తెలియడంలేదు అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ముందు నుయ్యి వెనక గొయ్యి సామెతగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోందని అంటున్నారు.

రాజధాని ట్రబుల్స్ తోనే వైసీపీ అయిదేళ్ల అధికారం పుణ్యకాలం అంతా సాగిపోయేలా ఉందని కూడా అంటున్నారు. మూడు రాజధానులు అన్నారు, మూడు ప్రాంతాలకు హామీ ఇచ్చారు. అమరావతిని పక్కన పెడితే విశాఖ రాయలసీమ జనాలు ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతారు. అలాగే ముందు ఉన్న వేడి తరువాత ఉండదు. ఈ పరిస్థ్తులలో ఏం చేయాలా అన్నదే ప్రభుత్వానికి తెలియడంలేదు అని అంటున్నారు.

మూడు రాజధానులు కాదు ఒక రాజధాని కాదు అసలు ఏపీకి రాజధాని ఏమీ లేకుండా కాకుండా చేశారు అంటూ విపక్షాలు ఎన్నికల వేళ అంటే అది రాజుకుంటే వైసీపీకి పొలిటికల్ ట్రబుల్స్ కూడా తప్పవని అంటున్నారు. మొత్తానికి రాజధాని అంశం ట్రబుల్స్ క్రియేట్ చేస్తోంది అని అంటున్నారుట. ఈ క్రమంలో మూడు రాజధానులు ప్రభుత్వం కేంద్ర సాయం కోరుతుందా అన్నదే చర్చగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.