Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్: మంత్రి నాని చెప్పిన సంచలన విషయాలు

By:  Tupaki Desk   |   27 Dec 2019 9:25 AM GMT
ఏపీ కేబినెట్: మంత్రి నాని చెప్పిన సంచలన విషయాలు
X
ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్తు పై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీఎన్ రావు నివేదిక తో పాటు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నాని విలేకరుల తో వివరాలు వెల్లడించారు.

ఏపీ రాజధాని పై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిందని.. ప్రపంచ ప్రఖ్యాత బీసీజీ గ్రూపు జనవరి 3న నివేదిక ఇవ్వబోతోందని.. అది వచ్చాక ఈ రెండు నివేదికలపై ‘హైలెవల్ కమిటీ’ ఏర్పాటు చేసి రాజధాని పై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాని ప్రకటన చేశారు.

ఇక అమరావతిలో రాజధాని ఏర్పాటు కు ముందే టీడీపీ నేతలు, వారి డ్రైవర్లు, బంధువులు పెద్ద ఎత్తున భూములు కొన్నారని.. దానిపై లోకాయుక్త కానీ సీబీఐ తో కానీ విచారణ జరుపాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి నాని సంచలన ప్రకటన చేశారు. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపి నిజాలు వెల్లడిస్తామని అందరి పాపం పండే రోజు వచ్చిందని నాని హెచ్చరించారు. చంద్రబాబు సీఎం గా ఉన్న వాటాలున్న కంపెనీ కూడా భూములు కొనుగోలు చేసినట్టుగా మంత్రి నాని తెలిపారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి న్యాయం చేస్తామని.. వారి పై కేసులు కూడా ఉండవన్నారు.

చంద్రబాబు 1.10 లక్షల కోట్ల తో అమరావతి రాజధాని కట్టాలని నిర్నయించారని.. కేవలం 5400వేల కోట్లు మాత్రమే అప్పులు తెచ్చి అమరావతి కట్టకుండా వదిలేశారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. 5400వేల కోట్లతో అమరావతిలో ఏ నిర్మాణాలు లేవని.. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియదని నాని ఆరోపించారు. మిగిలిన 1.05 లక్షల కోట్లు ఎక్కడ తేవాలి? ఎన్ని సంవత్సరాలకు ఖర్చు చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు తెచ్చిన 5వేల కోట్లకు వడ్డీ 500 కోట్లు కడుతున్నామని.. లక్ష కోట్లు తెస్తే ఏపీ ఎంత అప్పు చెల్లించాలని నాని ప్రశ్నించారు.

ఎన్నివేల కోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని జగన్ అభిప్రాయ పడినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. సుమారు 4వేలకు పైగా ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపారన్నారు. రాజధాని తరలింపుపై తొందరలేదని జగన్ చెప్పారని తెలిపారు. అమరావతి లో పెట్టే ఖర్చు లో 10శాతం ఖర్చు చేసినా కూడా విశాఖపట్నం అభివృద్ధిని చేసే అవకాశం ఉందని జగన్ అభిప్రాయ పడినట్టు గా సమాచారం. రాజధాని మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తెలిపారన్నారు.

వైఎస్ జగన్ ను టీడీపీ మీడియా టార్గెట్ చేసి రచ్చ చేస్తోందని మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. జగన్ చేసిన చిన్న తప్పులను పెద్దవిగా చేస్తూ ఎక్కడ దొరికితే ఆయనపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారని నాని ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించిందని.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని తెలిపారు.