Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం.. మతలబేంటి?

By:  Tupaki Desk   |   31 March 2021 2:30 PM GMT
పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం.. మతలబేంటి?
X
ఏపీలో సొంతంగా అధికారంలోకి రావడం కష్టమని బీజేపీకి అర్థమైందా? దేశవ్యాప్త పరిణామాలు.. ఏపీపై ప్రభావం చూపి బీజేపీపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయా? అందుకే జనసేనాని పవన్ ను కమలం పార్టీ నెత్తిన పెట్టుకోవాలని చూస్తోందా? పవన్ ను సీఎం క్యాండిడేట్ గా బీజేపీ ఎందుకు ప్రకటించిందని ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. కమలం పార్టీ నేతల పక్కా ప్లాన్ ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ఇప్పుడు బీజేపీకి ఇజ్జత్ కా సవాల్ గా మారింది. ఇక్కడ గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని జనాలు నమ్మే పరిస్థితి లేదు. దీంతో జనసేనాని పవన్ పైనే బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. తిరుపతిలో ఓట్లు రాలాలంటే పవన్ రావాల్సిందేనని బీజేపీ వ్యూహాత్మకంగా క్రియేట్ చేసింది.

ప్రధానంగా కాపు ఓట్లపై దృష్టిపెట్టిన బీజేపీ.. పవనే తమ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించడం ద్వారా ప్రచారానికి ఆయన రాక తప్పనిసరి పరిస్థితిని కల్పించిందని అంటున్నారు.

పవన్ ను సీఎంగా ప్రకటించడంపై టీడీపీ ఆందోళనగా ఉంది. చంద్రబాబును మించి పవన్ ఎదిగితే ముందుగా దెబ్బపడేది టీడీపీకేనన్న ఆందోళన వారిలో ఉంది. ఇక తిరుపతి ఉప ఎన్నిక కోసమే సోము వీర్రాజు ‘సీఎం పవన్’ అని ప్రకటించారని వైసీపీ సెటైర్లు వేస్తోంది.

అయితే ఏపీలో బీజేపీతో కాదనే పక్కా ప్లాన్ తో పవన్ ను పట్టాలెక్కిస్తోంది బీజేపీ. ఇప్పటికిప్పుడు ‘పవన్ సీఎం’ అన్న ప్రకటనతో బీజేపీకి వచ్చిన నష్టం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో సాధించినట్టే అసెంబ్లీలోనూ జనసేన ఎక్కువ సీట్లు సాధిస్తే ఆ పార్టీకే సీఎం పీఠం. ఒక వేళ బీజేపీ సాధిస్తే అప్పుడు చూసుకోవచ్చు.

అయితే ఈ ప్రకటన వల్ల బీజేపీ-జనసేన ఓటు బ్యాంకు ఏకమై పదిలమవుతుంది. కాపులు కలిసివస్తే ఏపీలో రాజ్యాంగ అధికారం సాధ్యమే. ఏపీలో బలమైన శక్తిగా ఎదగవచ్చని బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. పవన్ సీఎం అవుతాడన్న ఉద్దేశంతో కాపులు ఏకమైతే అది బీజేపీకి లాభమే. దానివల్ల వైసీపీ, టీడీపీకి నష్టం జరిగి బీజేపీకి లాభమవుతుంది. అందుకే సీఎం పవన్ నినాదం రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతుందనే బీజేపీ ఈ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చిందంటున్నారు.