Begin typing your search above and press return to search.

ధర్మపోరాట దీక్షకు రెడీ అవుతున్న ఏపీ భవన్

By:  Tupaki Desk   |   9 Feb 2019 5:08 PM GMT
ధర్మపోరాట దీక్షకు రెడీ అవుతున్న ఏపీ భవన్
X
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 11న దిల్లీ చేపట్టబోతున్న ధర్మ పోరాట దీక్షకు అక్కడి ఏపీ భవన్‌ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చేపట్టనున్న ఈ దీక్ష కోసం ఏపీ భవన్ ప్రాంగంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి అధికారులతో పాటు ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు - స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.

దీక్షలో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా సకల ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా భవన్ అధికారులు, సిబ్బందికి విశదీకరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టనున్న ధర్మపోరాట దీక్ష విజయవంతం చేయడానికి అక్కడ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

దీక్ష ప్రధాన వేదిక వద్ద అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసు రక్షణ వలయం, మంచినీటి సరఫరా, మీడియా లాంజ్, ప్రసారమాధ్యమాల ద్వార ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు వంటివన్నీ సిద్శమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రం నుంచి తరలివస్తున్న వారికి హోటల్స, ఇతర భవనాలలో ఏర్పాట్లు చేసే బాధ్యతలను ఒక బృందం చూపుకుంటోంది.

కాగా చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రికే దిల్లీ చేరుకోనున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.15 నిముషాలకు దిల్లీ విమానాశ్రయానికి వస్తారు. ఏపీ భవన్‌ లో రాత్రి బస చేసి 11వ తేది సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్సించి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు చేరుకొని అంబెడ్కర్ విగ్రహానికి పుష్పమాల వేసి అంజలి ఘటించి భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట దీక్ష ప్రారంభిస్తారు.

అనంతరం.. 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12.30కి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి - కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతారు.