Begin typing your search above and press return to search.

మేధావుల ఐడియాలు వింటే షాక్ తినాల్సిందే

By:  Tupaki Desk   |   19 Jan 2016 12:22 PM IST
మేధావుల ఐడియాలు వింటే షాక్ తినాల్సిందే
X
ఏపీ అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడవటం.. రాజకీయ పక్షాలు తమకు తోచినట్లుగా వ్యవహరించటంతో సభ రసాభాసాగా సాగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టసభల్లో నైతిక విలువలు పెంచటం ఎలా అన్న అంశంపై పలు వర్గాలకు చెందిన మేదావులు ఒకచోటకు చేరి సమాలోచనలు జరిపారు. ఈ మేధావుల మేధోమధనానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్.. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ లు కూడా హాజరయ్యారు.

పలువురు నేతలతో పాటు.. ఈ సదస్సుకు హాజరైన మేధావి ప్రముఖుల విషయానికి వస్తే.. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మ నాభయ్య.. దూరదర్శన్ మాజీ డైరెక్టర్ అనంతపద్మనాభం.. పాత్రికేయుడు సి. నరసింహరావు.. సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.. రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ పాండురంగారవు.. జస్టిస్ భవానీ ప్రసాద్.. సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరు వెంకటేశ్వరరావు.. తదితరులు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సభా నిర్వహణలో ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీరు సూచించిన సలహాలు వింటే కాస్తంత ఆశ్చర్యం అనిపించక మానదు. సభా నిర్వహణ సరిగా సాగాలంటే ఎంతసేపూ టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపేయాలన్న మాటే వారి నోట వినిపించటం గమనార్హం. అన్ని రోగాలకు జిందా తిలిస్మాత్ మాత్రమే అన్న చందంగా అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా జరగటానికి టీవీ ప్రత్యక్ష ప్రసారాల నియంత్రణపై వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ఇంతమంది మేధావులు ఒక చోట చేరినా అందరి నోట ఒకేలాంటి పరిష్కారం లభించటం విశేషం. ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరి నోట ఈ తరహా వ్యాఖ్యలు రావటం చూస్తే కొద్దిపాటి షాక్ తప్పదు.