Begin typing your search above and press return to search.

తెలంగాణకు వరద హెచ్చరిక చేసిన ఏపీ

By:  Tupaki Desk   |   22 Sept 2016 5:30 PM IST
తెలంగాణకు వరద హెచ్చరిక చేసిన ఏపీ
X
నిప్పు, ఉప్పులా విరుచుకుపడే తెలుగు రాష్ట్రాల జలవనరుల మంత్రులు ప్రజాసంక్షేమం విషయంలో మాత్రం కోపతాపాలను పక్కనపెట్టి సహకరించుకుంటున్నారు. తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడం... ఇప్పుడు ఏపీలోనూ వర్షాలు తీవ్రమవడంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమా ఈ రోజు ఉదయం తెలంగాణ జలవనరుల మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి వరద ముప్పు ఉంది జాగ్రత్త బ్రదర్ అని హెచ్చరించారు.

పులిచింతల ప్రాజెక్టుకు దాదాపు 2 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం మరికొన్ని గంటల్లో వస్తుందని, దీని ప్రభావంతో ఏపీలోని గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని ఆయన హరీశ్ ను అలర్ట్ చేశారు. పులిచింతలకు వరద పెరిగితే రెండు రాష్ట్రాలకూ నష్టమేనని అన్నారు.. వస్తున్న వరద నీటిని ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్వహించితే రెండు రాష్ట్రాల్లో ముప్పు తప్పుతుందని సూచించారు. మాచర్ల, గురజాల, రెంటచింతల, వెల్దుర్తి తదితర మండలాలతో పాటు మిర్యాలగూడ పరిధిలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరంతా పులిచింతలకే వస్తుందని దేవినేని గుర్తు చేశారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా పులిచింతల ప్రాజెక్టును సంయుక్తంగా పర్యవేక్షిద్దామని సూచించారు. వెంటనే నల్గొండ జిల్లా అధికారులను అప్రమత్తం చేయాలని దేవినేని సూచించారు. దేవినేని ఫోన్ ఇచ్చిన సమాచారానికి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా దేవినేని హెచ్చరించినట్లే పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పులిచింతల ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కల వదల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 15 గేట్లనూ ఎత్తివేసిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు వదులుతున్నారు. ప్రాజెక్టులో 29 టీఎంసీలకు మించి నీరు నిల్వ ఉందని వెల్లడించారు. కాగా, ఈ వరద నీటి ప్రభావంతో అటు గుంటూరు, ఇటు నల్గొండ జిల్లాల్లోని 9 గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది. ఇప్పటికే గ్రామాల్లోని ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా పునరావాస శిబిరాలకు తరలించడంతో చాలావరకు ప్రమాదం తప్పింది.