Begin typing your search above and press return to search.

తాజాగా వెయ్యి కోట్లు.. 9 నెలల అప్పును 5 నెలలకే తీసుకున్నారా?

By:  Tupaki Desk   |   1 Sep 2021 6:30 AM GMT
తాజాగా వెయ్యి కోట్లు.. 9 నెలల అప్పును 5 నెలలకే తీసుకున్నారా?
X
అప్పుతో బండి లాగిస్తున్న ఏపీ సర్కారు.. అంతకంతకూ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. తాజాగా దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. తొమ్మిది నెలల కాలానికి తీసుకోవాల్సిన అప్పును ఐదు నెలలకే తీసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. దీంతో.. బహిరంగ మార్కెట్ రుణ పరిమితి మేరకు మొత్తం అప్పును తీసుకున్నట్లైంది. తాజాగా రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యురిటీల వేలంలో పాల్గొని రూ.వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది.

తాజాగా తీసుకున్న అప్పును 14 సంవత్సరాల్లో తీర్చేందుకు అంగీకరిస్తూ.. ఇందుకుగాను 7.05శాతం వడ్డీ చెల్లింపునకు సిద్ధమైంది. దీంతో.. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.20,751 కోట్లను రుణంగా తీసుకున్నట్లుగా తేల్చారు. తాజాగా తీసుకున్న రూ.వెయ్యి కోట్ల రుణంతో కలిపి గడిచిన ఐదు నెలల్లో తీసుకున్న అప్పు లెక్క ఒకటి షాకింగ్ గా మారింది. తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన రుణాన్ని కేవలం ఐదు నెలలకే ఏపీ సర్కారు తీసుకోవటం గమనార్హం.

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఏపీ రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా కేంద్రం డిసైడ్ చేసింది. ఇంతకు మించి ఎక్కువ తీసుకోవటానికి వీల్లేదు. ఏ రకంగా అప్పు తీసుకున్నా.. ఈ మొత్తానికి దాటటానికి వీల్లేదు. అయితే.. పరిమితి మించి అప్పు తీసుకుంటుందంటూ ఈ పరిమితికి కోత పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రుణపరిమితి రూ.27,688 కోట్లకు తగ్గిపోయింది. నెలకు ఎంత చొప్పున రుణం తీసుకునేఅవకాశం ఉందో లెక్క కట్టారు. ఈ లెక్కన తొమ్మిది నెలల కాలానికి రూ.20,751 కోట్లు తీసుకునే వీలుంది.

తొలి తొమ్మిది నెలల కాలానికి రూ.20,751 కోట్లకు ఓకే చెప్పినా మరో రూ.7వేల కోట్ల రుణం తీసుకునే వీలుంది. అయితే.. అది డిసెంబరు తర్వాతే తీసుకునే వీలుంది. పాత అప్పు కోత ఈ ఏడాదికి వద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అందుకు అంగీకరించలేదు. దీంతో.. తొమ్మిది నెలలకు తీసుకోవాల్సిన అప్పు ఐదు నెలలకు పరిమితి దాటిపోవటంతో.. రానున్న నాలుగు నెలలు అప్పులేకుండా బండి ఎలా నడిపిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.