Begin typing your search above and press return to search.

కశ్మీర్ పై మోడీషా ప్లాన్ అతనికి తెలుసా?

By:  Tupaki Desk   |   5 Aug 2019 5:38 AM GMT
కశ్మీర్ పై మోడీషా ప్లాన్ అతనికి తెలుసా?
X
అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వాతంత్ర్య వచ్చిన నాటి నుంచి జమ్ముకశ్మీర్ ఇష్యూలో నాటి పాలకులు అనుసరించిన విధానాలతో నేటికి రావణకాష్ఠంలా తగలబడుతూనే ఉంది. భారత్ కు రాచపుండుగా మారిన కశ్మీరానికి సర్జరీ చేసేందుకు మోడీషాలు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. కశ్మీర్ ఇష్యూను టేకప్ చేయటానికి చాలానే గట్స్ ఉండాలి. అవి తమ వద్ద టన్నుల కొద్దీ ఉన్నాయన్నట్లుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు.. యుద్ధ ప్రాతిపదికన ఆసక్తికర నిర్ణయాల్ని తీసుకుంటుంది.

అయితే.. మోడీ సర్కారు ఆలోచన ఏమిటన్న విషయంపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. ఇలాంటి వేళలో.. బీజేపీకి సన్నిహితంగా ఉండే బాలీవుడ్ ప్రముఖుడు కమ్ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. చర్చనీయాంశంగా మారింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ.. ఒమర్ అబ్దుల్లాలు హౌస్ అరెస్ట్ చేయటం తెలిసిందే. దీంతో.. అసలేం జరుగుతోందన్న అంశంపై అంచనాలే తప్పించి.. వాస్తవంగా ఏం జరగనుందన్నది ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి.

ఇలాంటివేళ.. అనుపమ్ ఖేర్ ఆదివారం అర్థరాత్రి తర్వాత ఒక ట్వీట్ చేశారు. కశ్మీర్ పరిష్కారం మొదలైందంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. కశ్మీర్ అంశంపై మోడీ సర్కారు తీసుకునే నిర్ణయానికి సంబంధించిన సమాచారం ఏదో ఆయనకు తెలిసిందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

మీకు తెలిసిన సమాచారాన్ని మాకూ చెప్పండంటూ కొందరు.. చూస్తుంటే కశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకునే చర్యలకు సంబంధించిన నిర్ణయం ఏదో ఆయనకు తెలిసినట్లుగా ఉందని.. ఆ వివరాలు తమకు కూడా తెలియజేయాలని వారు కోరుతున్నారు. అయితే.. నెటిజన్ల వ్యాఖ్యలకు అనుపమ్ ఖేర్ ఎలాంటి స్పందనను వ్యక్తం చేయటం లేదు.

ఇదిలా ఉంటే.. కశ్మీర్ లో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా సిబ్బంది సిద్ధమయ్యాయి. కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగునున్న కారణంగా కీలక ప్రాంతాల్లోనూ.. అల్లర్లు చోటు చేసుకునే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భద్రతను భారీగా పెంచేశారు. గడిచిన నాలుగు రోజులుగా అమర్ నాథ్ యాత్రను రద్దు చేయటంతో పాటు.. కశ్మీర్ లో పర్యటిస్తున్న పర్యాటకుల్ని తిరిగి వెళ్లిపోవాలన్న ఆదేశాలతో పాటు.. కశ్మీర్ లో ఉన్న వర్సిటీల్లోని వేర్వేరు ప్రాంతాల వారిని వెనక్కి వెళ్లిపొమ్మని ఆదేశాలు జారీ కావటం తెలిసిందే. ఇలాంటి వేళ అనుపమ్ ఖేర్ పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.