Begin typing your search above and press return to search.

యాంటీ టీడీపీ లాబీ వీర్రాజుకు జై కొడుతోంది!!

By:  Tupaki Desk   |   12 April 2016 4:03 AM GMT
యాంటీ టీడీపీ లాబీ వీర్రాజుకు జై కొడుతోంది!!
X
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు విపరీతమైన సందిగ్ధం నెలకొని ఉంది. 2019 ఎన్నికలకు తమ పార్టీని స్వతంత్రంగా పోటీచేయగల స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడమా? లేదా, అప్పటికి కూడా తెలుగుదేశం పొత్తుల్లోనే ఉంటూ.. వారిచ్చినన్ని సీట్లు పుచ్చుకుని.. రాజకీయ ప్రస్థానం సాగించడమా? అనే మీమాంస వారిని వేధిస్తున్నది. సహజంగానే ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యమేలుతున్నదిత గనుక.. ఆ పరిస్థితుల్ని తమకు రాజకీయంగా అనుకూలంగా వాడుకుని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే కోరిక ఎక్కువమందికి ఉంటుంది. స్వతంత్రంగానే ఒక పెద్ద పార్టీగా ఆవిర్భవించాలనే ఆలోచనే ఎక్కువమందిలో ఉంది. తెలుగుదేశం నీడలో ఉన్నంత కాలం తాము సొంతంగా ఎదగడం కష్టమని వారి భావన.

అలాంటి సంక్లిష్టమైన నేపథ్యంలో.. ఇంకా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భాజపా అధ్యక్ష నియామకం జరగకుండా ఉండడం గమనార్హం. ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేక పోకడలనే అనుసరిస్తూ పార్టీగా ఎదగాలని అనుకుంటున్న వారు.. అధ్యక్షస్థానం కోసం సోము వీర్రాజు నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆ విషయంలో రాష్ట్ర భాజపాలో స్పష్టమైన విభజన వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది. తెదేపా పట్ల మెతక నాయకులు కొందరు కంభంపాటి హరిబాబును రెండోసారి కొనసాగించాలని పట్టుపడుతున్నారుట.

అయితే ఆయన నేతృత్వంలో పార్టీని స్వతంత్రంగా తీర్చిదిద్దుకోలేం అనుకుంటున్న వారు మాత్రం.. సోమువీర్రాజు అధ్యక్ష పదవిలో ఉంటేనే మేలు జరుగుతుందని వాదిస్తున్నారు. చంద్రబాబు సర్కారు లోపాలను స్పష్టంగా ధైర్యంగా ఎత్తిచూపగల సోమువీర్రాజు - పురందేశ్వరి వంటి నాయకులు అధ్యక్షస్థానంలో ఉంటే మాత్రమే పార్టీకి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనేది వారి వాదన. అయితే.. కుల సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకున్నప్పుడు.. సోము వీర్రాజు చేతికి అధ్యక్షపదవి ఇవ్వాలనే డిమాండ్‌ పార్టీలో పెరుగుతున్నదిట. తెలుగుదేశం వ్యతిరేక లాబీ మొత్తం.. సోము కే అనుకూలంగా ఉన్నదని అంటున్నారు. మరి చంద్రబాబు ఈ పరిణామాల్లో ఎలా చక్రం తిప్పుతారో చూడాలి.