Begin typing your search above and press return to search.

వైసీపీ నేతకు వ్యతిరేకంగా మరో వైసీపీ నేత ఆమరణ దీక్ష

By:  Tupaki Desk   |   3 Oct 2020 4:00 PM IST
వైసీపీ నేతకు వ్యతిరేకంగా మరో వైసీపీ నేత ఆమరణ దీక్ష
X
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రాజకీయం సెగలు కక్కుతోంది. అధికార వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. సొంత వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి నరసింహరాజు తీరును వ్యతిరేకిస్తూ అసంతృప్త నాయకులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.

ఉండి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే గెలిచారు. కానీ అధికార వైసీపీ పార్టీ ఇన్ చార్జిదే హవా కొనసాగుతోంది. అనధికార ఎమ్మెల్యేగా ఉండిలో ఇప్పుడు వైసీపీ ఇన్ చార్జి హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా కొందరు నాయకులు రోడ్డెక్కారు. ఏకంగా ఓ నాయకుడు ఆమరణ దీక్ష చేపట్టే వరకు వెళ్లింది. ఈ పంచాయితీ అదిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో ఓ ఎమ్మెల్యేను రంగంలోకి దింపి రాజీ కుదిర్చారు.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు వైసీపీ అభ్యర్థి నరసింహరాజును ఓడించారు. ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎండగడుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే రామరాజు. అధికార పార్టీ నేతకు కొరకరాని కొయ్యగా మారారు.

అయితే ఇక్కడ ఓడిపోయినా వైసీపీ అధికారంలో ఉండడంతో నరసింహరాజు అనధికార ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. అభివృద్ధి , కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాలన్నీ నరసింహరాజు కనుసన్నల్లో జరుగుతాయి. దీంతో ఈయన వ్యవహారశైలిపై పార్టీ నాయకులకు మింగుడుపడడం లేదు.

తాజాగా వైసీపీ ఇన్ చార్జి నరసింహరాజును వ్యతిరేకిస్తూ కొందరు వైసీపీ నేతలు రోడ్డెక్కి ఆందోలన చేశారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్న తమను కాదని.. కొత్తగా వచ్చిన వారికి పదవులు, అభివృద్ధి పనులు అప్పగిస్తున్నామని ఆరోపిస్తున్నారు.ఈ అంశంపైనే మండల, గ్రామస్థాయి నాయకులు రుసరుసలాడుతున్నారు. ఈ అంశంపైనే మండల, గ్రామస్థాయి నాయకులు రుసరుసలాడుతున్నారు. పీవీఎల్‌ తీరును ఖండిస్తూ గొల్లలకోడేరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి నిరసన తెలిపారు. దాంతో పీవీఎల్ తన అనుచరులతో ఆ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించారు. ఈ చర్యకు నిరసనగా శ్రీనివాసవర్మ తన ఇంట్లో ఆమరణ దీక్షకు దిగారు.

ఇలా గ్రూప్ తగాదాలు తీవ్రరూపం దాల్చుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం. శ్రీనివాసవర్మ దీక్షను విరమింపజేశారు వైసీపీ మరో ఎమ్మెల్యే గ్రంధి. ఆ తర్వాత ఆయనతోపాటు పీవీఎల్ నరసింహారాజులు శ్రీనివాస వర్మ ఇంటికెళ్లి బుజ్జగించారట. ఇక నుంచి విభేదాలకు తావులేకుండా అంతా ఐక్యంగా పనిచేద్దామని సూచించడంతో వర్మ వెనక్కి తగ్గారట. ఒక గొడవతో సొంత పార్టీ నేతలే కుమ్ములాటలకు దిగుతుండటంతో వైసీపీ అధిష్టానం సైతం దిగొచ్చి సర్ధిచెప్పడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.