Begin typing your search above and press return to search.

ఆగని లోన్ యాప్ వేధింపులు.. మరో వివాహిత బలి

By:  Tupaki Desk   |   12 July 2022 8:30 AM GMT
ఆగని లోన్ యాప్ వేధింపులు.. మరో వివాహిత బలి
X
రోజురోజుకు లోన్ యాప్ ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కొందరు చనిపోతున్నా.. బాధితుల సంఖ్య పెరిగిపోతున్నా లోన్ యాప్ ల తీరు మాత్రం మారడం లేదు.ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పరిధిలో ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ పరిధిలో 39 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో 30 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజే ఏకంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి..

వివిధ యాప్ లు, కంపెనీలు.. తమ వద్ద డబ్బులు తీసుకున్న కస్టమర్లను నానా బూతులు తిడుతూ ఫోన్ లో బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని మహిళలకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో రుణాల ప్రతినిధులు మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ లోని కాంటాక్టులను ట్రేస్ చేసి అందరికీ మెసేజ్ లు పంపి పరువు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు.

తాజాగా ఓ మహిళ లోన్ యాప్ ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష అనే వివాహిత ఇటీవల ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్ లలో రూ.20వేల లోన్ తీసుకుంది.

రుణాలు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీ అని చెప్పిన నిర్వాహకులు ప్రత్యూష దగ్గర రూ.20వేల రుణానికి దాదాపు రూ.2 లక్షలు వసూలు చేశారు. దాదాపు రూ. 1.80 లక్షలు ఎక్కువగా వసూలు చేసినా వారు ఇంకా డబ్బులు కట్టాలని బెదిరించారు. లేకుంటే ప్రైవేటు ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్ మెయిల్చేశారు. బంధువులకు ఫోన్ చేసి పరువు తీస్తామని ఆందోళన చేశారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్ లు పంపుతూ ఆవేదనకు గురిచేశారు.ఏం చేయాలో.. ఎవరికి చెప్పాలో తెలియక ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తల్లిదండ్రులు, భర్తకు పంపింది. భర్త వెంటనే ఇంటికి రాగా ప్రత్యూష ఇంట్లో లేదు. ఫ్లెక్సీ వేలాడుతూ కనిపించింది.

తన భార్య సూసైడ్ పై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోన్ యాప్ వేధింపులే కారణమని మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే అసలు ఎవరూ రుణ యాప్ ల నుంచి లోన్స్ తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తీసుకుంటే వారు మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నారు.