Begin typing your search above and press return to search.

రఘురామ కేసులో మరో ట్విస్ట్

By:  Tupaki Desk   |   25 May 2021 8:35 AM GMT
రఘురామ కేసులో మరో ట్విస్ట్
X
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. గత శుక్రవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయినా ఇప్పటిదాకా ఆయన బెయిల్ పై విడుదల కాకపోవడం విశేషం.

నిన్నా మొన్నటి దాకా ఏపీ పోలీసులు కొట్టారని వాచిన కాళ్లను చూపిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా ఎక్కి బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు రఘురామకృష్ణంరాజు. చివరకు సుప్రీం కోర్టు ఆయన మొర ఆలకించి బెయిల్ మంజూరు చేసింది. అయితే పలు కండీషన్లు పెట్టింది. అవే శరాఘాతంగా మారాయి. ఇక సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నిబంధనలు రఘురామకు శాపంగా మారాయి.

ఇప్పుడు బెయిల్ ఇస్తామన్నా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటానని రఘురామ మొండికేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని ఆర్మీ డాక్టర్లు ఇప్పటికే చెప్పారు.

అయితే ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ కాగానే ఏపీ పోలీసులు బయటే ఉంటున్నారు. దీంతో ఆయనను మరో కేసులో తీసుకుపోయేలా ఉండడంతో తాను పూర్తిగా కోలుకునే వరకు వెళ్లనని తాజాగా ఎంపీ రఘురామ ఆర్మీ ఆస్పత్రి కమాండర్ కు లేఖ రాయడం సంచలనమైంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలాలా కనిపించడం లేదు.