Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కు మరో షాక్.. కమలం కంటే కారు మెజార్టీ అంత స్వల్పమా?

By:  Tupaki Desk   |   6 Dec 2020 4:00 PM IST
టీఆర్ఎస్ కు మరో షాక్.. కమలం కంటే కారు మెజార్టీ అంత స్వల్పమా?
X
గ్రేటర్ ఎన్నికల ఫలితాల షాకులు ఇప్పట్లో తగ్గట్లే కనిపించట్లేదు. తెలంగాణలో తమకు తిరుగులేదని చెప్పుకునే టీఆర్ఎస్ కు బీజేపీ ఇచ్చిన షాక్ అలాంటి ఇలాంటిది కాదు. ఓట్ల లెక్కింపు పూర్తి అయి.. ఫలితాలు మొత్తం విడుదలైన తర్వాత కూడా కొన్ని గణాంకాల్ని అధికారులు వెల్లడించలేదు. తాజాగా వస్తున్న గణాంకాలు టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటమే కాదు.. గులాబీ నేతల గొంతుల్ని తడారిపోయేలా చేస్తుందని చెప్పాలి.

పార్టీ పట్ల.. ప్రభుత్వం పట్ల గ్రేటర్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంత ఎక్కువా? అన్నట్లుగా ఉన్నాయి తాజాగా వెల్లడైన గణాంకాల్నిచూస్తే. గ్రేటర్ ఎన్నికల్లో 55 స్థానాల్లో టీఆర్ఎస్.. 48 స్థానాల్లో బీజేపీ గెలుచుకోవటం తెలిసిందే. డివిజన్ల పరంగా చూస్తే ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఆరు డివిజన్లు. కానీ.. రెండు పార్టీలకు నమోదైన ఓట్ల వ్యత్యాసం కేవలం ఆరువేలు మాత్రమే కావటం గమనార్హం.

జీహెచ్ఎంసీ విడుదల చేసిన లెక్కల ప్రకారం గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 34,44,093 ఓట్లు నమోదైతే.. ఇందులో 33,35,697 మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. అంటే.. 79,735 ఓట్లు చెల్లుబాటు కాలేదు. నోటాకు 28,661 ఓట్లు పడ్డాయి. ఇక.. ఓట్ల పోరులో టీఆర్ఎస్.. బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధమే సాగింది. టీఆర్ఎస్ 35.73 శాతం ఓట్లను సొంతం చేసుకుంటే.. బీజేపీ 35.55 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. అంటే.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం కేవలం 0.18 శాతం మాత్రమే.

మరింతబాగా అర్థం కావాలంటే రెండు పార్టీల మధ్య వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే విషయం మరింత బాగా అర్థమవుతుంది. గ్రేటర్ లో టీఆర్ఎస్ కు 11,92,162 ఓఎట్లు దక్కితే.. బీజేపీకి 11,86,096 ఓట్లు దక్కాయి. అంటే.. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 6,066 మాత్రమే. అంటే.. వెంట్రుక వాసిలో భారీ విజయం బీజేపీకి చేజారిందని చెప్పాలి. ఇక.. మజ్లిస్ కు 18.91 శాతం (6,30,867ఓట్లు).. కాంగ్రెస్ కు 6.61 శాతం (2,20,504ఓట్లు).. టీడీపీకి 1.65 శాతం (55,287 ఓట్లు) నమోదయ్యాయి. డివిజన్ల సంఖ్యను చూస్తే.. మిగిలిన వారి కంటే అధిక్యత ప్రదర్శిస్తున్నా.. అదంతా చాలా స్వల్ప అధిక్యతే తప్పించి మరింకేమీ లేదన్న విషయం తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. టీఆర్ఎస్ కు కొత్త దడ ఖాయం. అదే సమయంలో బీజేపీకి కొత్త ఉత్సాహం పక్కా అని చెప్పక తప్పదు.