Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ టీవీకి మరో షాక్

By:  Tupaki Desk   |   10 Nov 2020 5:00 PM IST
రిపబ్లిక్ టీవీకి మరో షాక్
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో మహారాష్ట్ర శివసేన సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది రిపబ్లిక్ టీవీ.. ఆ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి. దీంతో మహారాష్ట్ర సర్కార్ పాత కేసులో ఇప్పటికే అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో షాక్ రిపబ్లిక్ టీవీకి తగింది.

టీఆర్‌పీ రేటింగ్స్ కేసులో ముంబై పోలీసులు నేడు రిప‌బ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్‌ను తాజాగా అరెస్ట్ చేయడం సంచలనమైంది.. రిప‌బ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించినట్లు చూపించడానికి రేటింగ్‌లను తారుమారు చేశారనే ఆరోపణలతో డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘ‌న్‌శ్యామ్‌సింగ్‌ను మంగళవారం అరెస్టు చేశారు.

రిప‌బ్లిక్ టీవీ సీఈవో, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఘ‌న్‌శ్యామ్‌సింగ్‌ను పోలీసులు నేడు కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. రిప‌బ్లిక్ టీవీని ఎల్ల‌ప్పుడు చూసేలా ఉంచ‌డానికి కొంత‌మంది వీక్ష‌కుల‌కు స‌ద‌రు వ్య‌క్తులు డ‌బ్బులు ఇచ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి..

టీఆర్‌పీ కేసులో పోలీసులు అంత‌కుముందే స్థానిక చానెల్స్ ఫ‌క్త్ మ‌రాఠి, బాక్స్ సినిమాను కూడా అక్రమాలు చేసిన విచార‌ణ‌లో చేర్చారు. టీఆర్‌పీ కుంభకోణం వార్తల పోకడలను తారుమారు చేయడం అదేవిధంగా తప్పుడు కథనాల వ్యాప్తికి దోహదం చేశారని రిపబ్లిక్ టీవీపై పోలీసులు నేరారోపణ చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో రిపబ్లిక్ టీవీ తప్పుడు వార్తలు ప్రచారం చేసినందున ఈ చర్యలు తీసుకున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. మొత్తం రిపబ్లిక్ టీవీ, ఆ చానెల్ ను శివసేన సర్కార్ వేటాడుతుందనే చెప్పొచ్చు.