Begin typing your search above and press return to search.

చిరాగ్ కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి గట్టిగానే!

By:  Tupaki Desk   |   10 July 2021 12:31 PM GMT
చిరాగ్ కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి గట్టిగానే!
X
బీహార్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ చీలిపోయింది. ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ ను ఎంపీలంతా బహిష్కరించారు. కానీ పార్టీ నాదేనంటూ చిరాగ్ పోరాడుతున్నారు. చిరాగ్ స్థానంలో ఆయన సొంత బాబాయ్ పశుపతి పరాస్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పశుపతినే లోక్ సభ పక్ష ఎల్జేపీ పార్టీ నేతగా లోక్ సభ స్పీకర్ గుర్తించారు. ఈ క్రమంలోనే మోడీ కేబినెట్ లో పశుపతికి ఏకంగా కేంద్రమంత్రి పదవి కూడా దక్కింది.

అయితే పశుపతిని లోక్ సభ స్పీకర్ గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు చిరాగ్ పాశ్వాన్. దీనిపై చిరాగ్ కు గట్టి షాక్ తగిలింది. అసలు ఈ పిటీషన్ వేయడమే పెద్ద తప్పు అని.. కోర్టుకు రావడాన్నే న్యాయమూర్తులు తప్పుపట్టారట.. దీనిపై చిరాగ్ కు న్యాయమూర్తులు జరిమానా విధించడానికి రెడీ కాగా.. చిరాగ్ తరుఫు న్యాయవాది విన్నపం మేరకు వదిలేశారట..

ఎల్జేపీలో తిరుగుబాటు వర్గాన్నే మోడీ గుర్తించారు. చిరాగ్ ను పక్కనపెట్టి ఆయన బాబాయ్ పశుపతిని ఏకంగా కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. మోడీకి తాను హనుమంతుడిని అంటూ చెప్పుకున్న చిరాగ్ కు గట్టి ఝలక్ తగిలింది. పశుపతిని మోడీ ఆదరించడని.. తనకే ప్రాధాన్యం ఇస్తాడని చిరాగ్ భావించాడు. కానీ ఏకంగా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వడంతో చిరాగ్ తట్టుకోలేకపోతున్నాడు.

పశుపతికి మోడీ పదవి ఇచ్చిన వెంటనే తట్టుకోలేని చిరాగ్ దీన్ని అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. కానీ లోక్ సభ స్పీకర్ గుర్తించాక ఇప్పుడు కోర్టులు ఏమీ చేయలేవని.. చిరాగ్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అసలు దీనికి విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది.

పశుపతికి కేంద్రమంత్రి పదవి లభించడం.. హైకోర్టులో ఎదురుదెబ్బ నేపథ్యంలో ఇక చిరాగ్ రాజకీయ భవితవ్యం గందరగోళంలో పడినట్టు అయ్యింది. ఇక ఎల్జేపీ మొత్తం పశుపతి వర్గంకే చెందనుంది. ఇది చిరాగ్ కు కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు.