Begin typing your search above and press return to search.

ఇంటర్ విద్యార్ధులకి మరో షాక్ ... సిలబస్ మార్పు !

By:  Tupaki Desk   |   3 Jun 2020 9:50 AM GMT
ఇంటర్ విద్యార్ధులకి మరో షాక్ ... సిలబస్ మార్పు !
X
ఇంటర్ విద్యార్ధులకి ముఖ్యమైన గమనిక. ఇంటర్ సెకండ్ ఇయర్ హ్యుమానిటీస్ సిలబస్‌ లో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సెకండ్ ఇయర్ హ్యుమనిటీస్‌ సబ్జెక్టుల సిలబస్ ‌ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి ఆరు సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ‌ను మార్చేం దుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. సెకండ్ ఇయర్ హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, సివిక్స్‌, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సిలబస్‌ను పూర్తిస్థాయిలో మార్చాలని ఇంటర్‌ విద్యా పాలక మండలి ప్రతిపాదించింది. కాలేజీలు ప్రారంభం అయ్యే సమయానికి కొత్త సిలబస్ తో పాఠ్య పుస్తకాలను అందుబాటు లోకి తెచ్చేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

ఇంటర్ సెకండ్ ఇయర్ హ్యుమనిటీస్‌ సబ్జెక్టుల సిలబస్‌ మార్పుకు సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీలు చర్చోపచర్చలు చేసి పాఠ్యాంశాలను రూపొందించాయని, వారం, పది రోజుల్లో ఇందుకు ఆమోదముద్ర వేసి పాఠ్యపుస్తకాల ముద్రణకు సిద్ధం కావాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. మారుతున్న సిలబస్‌ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్ర చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ అంశాలు ఇతరత్రా పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠ్యాంశాలుగా పొందుపరుస్తున్నట్లు తెలిపారు. కళాశాలల పున:ప్రారంభానికి ఎలాగో రెండు నెలల వ్యవధి పడుతుందన్న ఆశాభావంతో ఉన్నామని, ఈలోపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ వివరించారు.

ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ మాద్యమాల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాలని, ఈ బాధ్యతను తెలుగు అకాడమీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు రెండున్నర లక్షల విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో హ్యుమ నిటీస్‌ విభాగాల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు గణాంకాలనుబట్టి తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి అయిదేళ్లకు సిలబస్‌ ను మార్చి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలోనే నిర్ణయం జరిగింది. 2019-20 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన హ్యుమనిటీస్‌ సబ్జెక్టుల సిలబస్‌ను మార్చిన ఇంటర్‌బోర్డు ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను మారుస్తోంది. ఇక ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ సబ్జెక్టుల సిలబస్‌ను కూడా ఈ విద్యా సంవత్సరం మార్చాల్సి ఉండగా జాతీయస్థాయిలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులకు సిలబస్‌ను మార్చే ఎన్‌సీఈఆర్‌టీ ముందుకు రాక పోవడంతో వారి సిలబస్ ను మార్చడంలేదని తెలిపింది.