Begin typing your search above and press return to search.

బాబుకి మరో షాక్ ...ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   4 March 2020 10:45 AM GMT
బాబుకి మరో షాక్ ...ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం !
X

బుధవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ అనంతరం కేబినెట్ భేటీ వివరాలను మంత్రి పేర్ని నాని వివరించారు. ఈ భేటీలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గతం టీడీపీ ప్రభుత్వం హయాంలో కేటాయించిన రెండెకరాల భూమి కేటాయింపుని రద్దు చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి,తాజాగా ఆమోదం తెలిపారు. ఆ రెండెకరాల భూమిని తిరిగి ప్రభుత్వ శాఖలకు అప్పగించనున్నారు. ఇక ఈ భేటీలో ప్రధానంగా జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేయాలని పూనుకొన్న ..ఇంటి స్థలాల పంపిణి పై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు.

ఉగాది రోజు 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్ధలాలు ఇచ్చే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అని , పేదలకు మొత్తం 43141 ఎకరాల భూమి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్నినాని ప్రకటించారు. ఇంటి పట్టాను వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే కాకుండా నిర్దేశిత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు పూర్తి హక్కు ఉంటుందని స్పష్టం చేసారుపంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ఐదేళ్ల తర్వాత విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని మంత్రి నాని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 16 వేల ఎకరాల భూమిని బయటివారి నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ప్రాంతాలను వైఎస్సార్ జగనన్న కాలనీలుగా అభివృద్ధి చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఈ భేటీలో కేంద్రం త్వరలో చేపట్టబోయే ఎన్‌ పీఆర్ పైన కూడా చర్చించారు. ఇందులో భాగంగా.. మూడు నెలలుగా మైనార్టీల్లో ఎన్.పి.ఆర్.పై నెలకొన్న భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని వారిలో భరోసా నింపేందుకు 2010 జనాభా లెక్కల ప్రశ్నావళికే ఈసారి జనాభా లెక్కలను పరిమితం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నట్లు మంత్రి నాని వివరించారు. అప్పటివరకు ఏపీలో జనగణన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్, భూ అక్రమణలపై ఏర్పాటు చేసిన సిట్‌కు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినట్లు వెల్లడించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్ధకు ఇచ్చిన కాంట్రాక్టులో చేసిన మార్పులను కేబినెట్ ఆమోదించింది. దీంతో భోగాపురం ఎయిర్ పోర్టు పరిధి 3000 ఎకరాల నుంచి 2500 ఎకరాలకు కుదించనున్నారు, రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం మిగతా భూమి వాడుకోనున్నారు.