Begin typing your search above and press return to search.

షీనా బోరా హత్య కేసులో మరో సంచలన ట్విస్ట్

By:  Tupaki Desk   |   16 Dec 2021 2:30 PM GMT
షీనా బోరా హత్య కేసులో మరో సంచలన ట్విస్ట్
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సంచలన ట్విస్ట్ వెలుగుచూసింది. తన కుమార్తె బతికే ఉందంటూ షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ తాజాగా సీబీఐకి లేఖ రాసిందట.. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె సీబీఐని కోరిందట.. అంతేగాక.. ఈ విషయంపై ఇంద్రాణీ ప్రత్యేక సీబీఐ కోర్టులో పిటీషన్ కూడా వేసిందని.. త్వరలోనే న్యాయస్థానం దీన్ని విచారణ చేపట్టనున్నట్టు జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ అరెస్ట్ అయ్యి 2015 నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఉంటోంది. ఇటీవల జైల్లో ఓ మహిళా ఖైదీ తనను కలిసిందని.. షీనాను ఆమె కశ్మీర్ లో చూసినట్లు తనకు చెప్పిందని ఇంద్రాణీ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

షీనా కోసం కశ్మీర్ లో గాలించాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరినట్లు సదురు కథనాల ద్వారా తెలిపాయి. అయితే దీనిపై ఇంద్రాణీ న్యాయవాదిని సంప్రదించగా.. ఆ లేఖను నేరుగా సీబీఐకే పంపించారని.. అందులో ఏముందో తనకు కూడా పూర్తిగా తెలియదని చెప్పారు.

2012లో షీనా బోరా హత్య జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ రాయ్ అరెస్ట్ అయ్యాడు. అతడిని విచారిస్తున్న క్రమంలోనే 2012లో షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత్య చేశారని.. ఆమెను ఒక చెల్లిగా తనకు పరిచయం చేసిందని తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తర్వాత దర్యాప్తు చేయగా.. షీనా.. ఇంద్రాణీ కుమార్తేనని తేలింది. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖేల్ ను గౌహతిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచింది. పెద్దయ్యాక ఇంద్రాణీ వద్దకు కూతురు షీనా రాగా వారిమధ్య ఆర్థిక విభేదాలు వచ్చాయి. అదీ కాక ఇంద్రాణీ భర్త పీటర్ మొదటి భార్య కుమారుడు రాహుల్ తో షీనా ప్రేమాయణం నడిపింది.

ఈ క్రమంలోనే ఇంద్రాణీ తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను గొంతునులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రాయ్ గఢ్ లోని అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది.