Begin typing your search above and press return to search.

మరో సంచలనం: ఎమర్జెన్సీ విధించిన ట్రంప్

By:  Tupaki Desk   |   12 Jan 2021 1:30 PM IST
మరో సంచలనం: ఎమర్జెన్సీ విధించిన ట్రంప్
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడు జోబైడెన్ ప్రమాణ స్వీకారం వేళ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీ విధించారు. జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేసేది అక్కడి క్యాపిటల్ భవనంలోనే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే జోబైడెన్ ను అధ్యక్షుడిగా గుర్తిస్తూ అమెరికా ఉభయసభలు ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశాన్ని నిరసిస్తూ ట్రంప్ మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగిన నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికా కొత్త అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ భవనం బయట జరిగే ఈ కార్యక్రమానికి ట్రంప్ మద్దతుదారుల నుంచి ముప్పు పొంచి ఉందని ఎఫ్.బీ?ఐ హెచ్చరికలు జారీ చేసింది. రాజధానిలోని క్యాపిటల్ భవనంతోపాటు అన్నిరాష్ట్రాల రాజధానుల్లోని క్యాపిటళ్లపై దాడికి కుట్ర జరుగుతోందని ఎఫ్.బీ.ఐ హెచ్చరించింది. కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

మరో 9 రోజుల్లోనే అధ్యక్ష సీటు నుంచి డొనాల్డ్ ట్రంప్ దిగిపోతుండగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీని విధించారు. జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎమర్జెన్సీ విధించాలన్న వాషింగ్టన్ మేయర్ బౌసర్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.