Begin typing your search above and press return to search.

టీ పీసీసీ చీఫ్ ఎంపికకు తాజాగా మరో అధ్యయనం

By:  Tupaki Desk   |   7 Jun 2021 4:31 AM GMT
టీ పీసీసీ చీఫ్ ఎంపికకు తాజాగా మరో అధ్యయనం
X
అయిపోయింది.. అంతా అయిపోయింది. ఇక.. అధికారికంగా ప్రకటించటం మాత్రమే మిగిలి ఉందన్న వాదనకు భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ లో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గడిచిన కొద్ది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారధిని నియమించేందుకు భారీగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర పార్టీ బాధ్యుడిగా వ్యవహరిస్తున్న మాణిక్యం ఠాగూర్.. ఆ మధ్యలో భారీ ఎత్తున కసరత్తు చేసి.. పలువురు నేతలతో మాట్లాడిన తర్వాత తన ప్రయారిటీ లిస్టును అధిష్ఠానం ముందు పెట్టినట్లుగా చెబుతారు. ఈ క్రమంలోనే సాగర్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం కావటంతో.. ఎన్నికల ఫలితం వెల్లడైన తర్వాత కొత్త రథసారధి పేరు ప్రకటిస్తారని భావించారు.

అందుకు భిన్నంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన కసరత్తును పక్కన పెట్టి.. తాజాగా మరోసారి అధ్యయనం చేయాలని.. రథసారధిగా ఎవరిని నియమించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని ఆమె కోరినట్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున నేతలు పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడుతున్న వేళ.. సరైన నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. ఈ క్రమంలోనే తాజా అధ్యయనమని చెబుతున్నారు.

మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవి తమకే వస్తుందని రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇప్పటికే దావత్ లకు సిద్ధమైన వేళ.. అనూహ్యంగా మరోసారి అధ్యయనం చేయాలని.. అందుకు సీనియర్ నేత ఒకరికి బాధ్యత అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి వర్గం నీరసపడిపోగా.. పార్టీ చీఫ్ పదవిని చేపట్టాలన్న ఆశతో ఉన్న వారు మాత్రం మహా ఉత్సాహంగా ఉన్నట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.